Let's talk: editor@tmv.in
నెక్లెస్ రోడ్‌లో ‘ఫైర్ సేఫ్టీ’ స్టాల్ ఏర్పాటు

నెక్లెస్ రోడ్‌లో ‘ఫైర్ సేఫ్టీ’ స్టాల్ ఏర్పాటు

Gaddamidi Naveen
18 ఏప్రిల్, 2026

తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'అగ్నిమాపక సేవా వారోత్సవాల'లో భాగంగా హైదరాబాద్ ప్రజల కోసం ఒక ప్రత్యేక అవగాహన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నెక్లెస్ రోడ్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో ఈ ఇంటరాక్టివ్ ఫైర్ స్టాల్‌ను అగ్నిమాపక శాఖ ప్రారంభించింది.

అగ్ని ప్రమాదాల నివారణ, అత్యవసర సమయాల్లో స్పందించే తీరుపై పౌరులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో అగ్నిమాపక దళం ఉపయోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరికరాలు, రోబోటిక్ పరికరాలు, రక్షణ కవచాలను ప్రజలు నేరుగా చూడవచ్చు. మంటలను ఎలా అదుపు చేయాలో నిపుణులైన అగ్నిమాపక సిబ్బంది లైవ్ డెమోల ద్వారా వివరిస్తారు. వివిధ రకాల ఫైర్ ఎక్స్‌టింగూషర్లు, రెస్క్యూ గేర్ల వినియోగంపై అవగాహన కల్పిస్తారు. ఇళ్లు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ పొందిన సిబ్బంది సూచనలు ఇస్తారు.

ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ స్టాల్ అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 20, వరకు ఇది కొనసాగనుంది. ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలని అధికారులు కోరుతున్నారు. ఈ ఫైర్ సేఫ్టీ స్టాల్‌ను సందర్శించడం ద్వారా ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంపొందించుకుని, భద్రతా చర్యలను పాటిస్తూ సమాజాన్ని మరింత సురక్షితంగా మార్చడంలో భాగస్వాములు కావాలని అగ్నిమాపక శాఖ విజ్ఞప్తి చేసింది.