
స్విస్ విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ప్రకటించిన ఢిల్లీ ఎయిర్పోర్ట్
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం తెల్లవారుజామున పెను ప్రమాదం తృటిలో తప్పింది. స్విస్ ఎయిర్ విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తి మంటలు చెలరేగడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. విమానంలో ఉన్న ప్రయాణికులందరినీ అత్యవసర మార్గాల ద్వారా సురక్షితంగా బయటకు తరలించారు.
ఏం జరిగిందంటే?
స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎల్ఎక్స్ 147 విమానం 232 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్‌లోని జూరిచ్‌కు బయలుదేరాల్సి ఉంది. ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో విమానం రన్‌వేపై పరుగులు తీస్తుండగా, ఎడమ వైపు చక్రం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడాన్ని సిబ్బంది గమనించారు. వెంటనే పైలట్లు అప్రమత్తమై టేకాఫ్‌ను నిలిపివేసి, విమానాశ్రయ నియంత్రణ గదికి సమాచారం అందించారు.
అత్యవసర తరలింపు.. నలుగురికి గాయాలు
సమాచారం అందిన వెంటనే విమానాశ్రయ అగ్నిమాపక దళం ఐదు ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుంది. రన్‌వేపై 'ఫుల్ హైడ్రాలిక్ ఎమర్జెన్సీ' ప్రకటించిన అధికారులు, ప్రయాణికులను విమానం నుంచి కిందకు దించేందుకు ఎమర్జెన్సీ స్లైడ్లను (జారుడు మెట్లు) వినియోగించారు. ఈ క్రమంలో కంగారుగా కిందకు దిగుతున్న సమయంలో నలుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వారికి వెంటనే ఎయిర్‌పోర్టులోని వైద్య విభాగం చికిత్స అందించింది. ప్రస్తుతం ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
విమానాశ్రయ కార్యకలాపాలు యథాతథం
ఈ ఘటనపై ఢిల్లీ విమానాశ్రయ యాజమాన్యం 'ఎక్స్' వేదికగా స్పందించింది. నిర్దేశించిన భద్రతా ప్రోటోకాల్స్‌ను తక్షణమే అమలు చేసినట్లు తెలిపింది. ఈ అత్యవసర పరిస్థితి వల్ల విమానాశ్రయంలోని ఇతర విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని, అన్ని సేవలు సజావుగానే సాగుతున్నాయని స్పష్టం చేసింది.
గడిచిన నెల రోజుల్లో ఢిల్లీలో జరిగిన రెండో పెద్ద విమానయాన ప్రమాద హెచ్చరిక ఇది. గత మార్చి 28న విశాఖపట్నం నుంచి వచ్చిన ఇండిగో విమానం కూడా ఇంజిన్ వైఫల్యంతో ఇదే విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్విస్ విమానాన్ని రన్‌వే నుంచి పక్కకు తరలించి, సాంకేతిక లోపంపై విచారణ జరుపుతున్నారు. తెల్లవారుజామున 3:30 గంటల సమయానికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
