
తిరుపతి జిల్లాలో ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా తడ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఓ ప్రైవేట్ బస్సులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీసిటీ నుంచి సూళ్లూరుపేటకు ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులంతా తృటిలో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం.. శ్రీసిటీలోని ఒక ప్రైవేట్ కంపెనీలో విధులు ముగించుకుని, ఉద్యోగులంతా తిరిగి సూళ్లూరుపేటకు అదే బస్సులో బయలుదేరారు. మార్గమధ్యంలో తడ సమీపానికి రాగానే బస్సు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి లోపల ఉన్న ఉద్యోగులందరినీ త్వరితగతిన కిందకు దించేశాడు.
ఉద్యోగులంతా కిందకు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సంతటా వ్యాపించాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరినీ సకాలంలో బయటకు తీసుకురావడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే బస్సు పూర్తిగా పూర్తిగా కాలిపోయింది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
