Let's talk: editor@tmv.in
కేరళ ఫైర్‌‌వర్క్స్‌ గోదాంలో అగ్నిప్రమాదం.. 13 మంది మృతి
కేరళ ఫైర్‌‌వర్క్స్‌ గోదాంలో అగ్నిప్రమాదం.. 13 మంది మృతి

కేరళ ఫైర్‌‌వర్క్స్‌ గోదాంలో అగ్నిప్రమాదం.. 13 మంది మృతి

Pinjari Chand
22 ఏప్రిల్, 2026

కేరళలోని త్రిశూర్ జిల్లాలో ముండతికోడ్ ప్రాంతంలో ఫైర్‌‌వర్క్స్‌ తయారీ యూనిట్‌లో మంగళవారం జరిగిన భారీ పేలుడు ఘోర విషాదానికి దారితీసింది. ఈ ఘటనలో కనీసం 13 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం మిగతా 13 మంది గాయపడినవారు చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండగా, ఐదుగురికి 70 శాతానికి పైగా కాలిన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది.

40 మంది కార్మికులు ఉన్నట్టు అంచనా

పేలుడు సంభవించిన సమయంలో అక్కడ ఉన్న షెడ్లలో సుమారు 40 మంది కార్మికులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. రాబోయే త్రిశూర్ పూరం (ఏప్రిల్ 26) ఉత్సవాల కోసం దేవాస్వం(దేవాలయం) తరఫున పటాకులు తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి మొత్తం 13 మృతదేహాలు చేరినట్లు అధికారులు తెలిపారు. కొన్ని అవశేషాలు విడివిడిగా లభించడంతో వాటిని వేర్వేరుగా లెక్కించారు.

వరుస పేలుళ్లతో రక్షణ చర్యలకు ఆటంకం

మధ్యాహ్నం సుమారు 3.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు అనంతరం కూడా కొంతసేపు వరుస పేలుళ్లు కొనసాగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పంట పొలాల మధ్య ఉన్న ఈ యూనిట్‌లో అనేక తాత్కాలిక షెడ్లలో పటాకులు తయారు చేస్తున్నట్లు సమాచారం. భారీ పేలుడు సంభవించడంతో కిలోమీటర్ల దూరం వరకు శబ్దం వినిపించింది. సమీప ఇళ్లకు కూడా నష్టం వాటిల్లింది.

సహాయక చర్యలు, వైద్య సహాయం

అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఇతర శాఖలు కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్ గాయపడిన వారికి తక్షణ వైద్యం అందించాలని ఆదేశించారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులైన వైద్యులను కూడా రప్పించాలని సూచించారు. ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ త్రిశూర్ మెడికల్ కాలేజ్, జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సమీప ఆసుపత్రులు అలర్ట్‌గా ఉండాలని సూచించారు.

దర్యాప్తునకు ఆదేశం

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మేజిస్ట్రియల్ స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. పేలుడు కారణాలపై సబ్-కలెక్టర్ విచారణ చేపట్టనున్నారు. ఈ ప్రమాదంలో ఎక్కువగా ముండతికోడ్, కుందన్నూర్ ప్రాంతాల వారే బాధితులుగా ఉన్నారు. కొంతమంది కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒక కార్మికుడు విల్సన్ తన అనుభవాన్ని వివరిస్తూ ‘ఒక్కసారిగా వెలుగు మెరుపు కనిపించింది, వెంటనే అగ్ని చెలరేగింది. ఆ తర్వాత ఏమి జరిగిందో గుర్తు లేదు’ అని తెలిపారు.

ప్రభుత్వం, నేతల సంతాపం

ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా సంతాపం తెలిపారు. కేంద్ర మంత్రి సురేష్ గోపీ, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్, రాష్ట్ర ప్రతిపక్ష నేత వీ డీ సతీశన్ తదితరులు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తమిళనాడు, ఏపీలో పేలుళ్ల ఘటనలు.. పలువురు మృతి

దక్షిణ భారత రాష్ట్రాల్లో పటాకుల తయారీ యూనిట్లలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రెండు భారీ పేలుళ్లలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.

తమిళనాడులో ఘోర పేలుడు

తమిళనాడులోని విరుధునగర్ జిల్లాలో ఇదే ఏడాది ఏప్రిల్ 19న పటాకుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం 25 మంది మృతి చెందగా, మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. ఫ్యాక్టరీలో భద్రతా నిబంధనలు ఉల్లంఘించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రసాయనాలు కలిపే సమయంలో జరిగిన పొరపాటే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సమీపంలోని వేట్లపాలెంలో ఫిబ్రవరి 28న ఫైర్‌‌వర్క్స్ యూనిట్‌లో పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో అనుమతించిన దానికంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తేలింది. అదేవిధంగా పటాకుల నిల్వ, తయారీ రెండూ ఒకే ప్రదేశంలో నిర్వహించడం వల్ల పేలుడు తీవ్రత పెరిగినట్లు అధికారులు గుర్తించారు.