
మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావుకు తుది వీడ్కోలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు(90)అంతిమయాత్ర గురువారం హైదరాబాద్‌లో అశ్రునయనాల మధ్య ముగిసింది. ఆయన పార్థివ దేహాన్ని చివరిసారిగా దర్శించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ఉంచిన పార్థివ దేహానికి బుధవారం సాయంత్రం నుంచే ప్రముఖులు ఆయన నివాసానికి తరలివచ్చారు. గురువారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి భాస్కరరావు భౌతికకాయాన్ని దర్శించి, పుష్పాంజలి ఘటించారు. ఆయన కుమారుడు, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను చిరంజీవి పరామర్శించి ధైర్యం చెప్పారు. సినీ రంగం నుంచి అల్లు అరవింద్, బన్నీ వాసు, విశ్వప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
రాజకీయ రంగం నుంచి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఏపీ నుంచి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తరలివచ్చారు. లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్, వివిధ పార్టీల అగ్రనేతలు భాస్కరరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు
మధ్యాహ్నం జూబ్లీహిల్స్ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందం గౌరవ వందనం సమర్పించింది. అంతిమయాత్ర పంజాగుట్టలోని హిందూ శ్మశాన వాటికకు చేరుకోగా అక్కడ భాస్కరరావు పెద్ద కుమారుడు నాదెండ్ల మురళి శాస్త్రోక్తంగా అంతిమ క్రతువులు నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం (గన్ సెల్యూట్) చేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, అభిమానులు ఈ కడసారి వీడ్కోలులో పాల్గొన్నారు. భాస్కరరావు మృతి తెలుగు రాజకీయాల్లో ఒక శకాన్ని ముగించిందని ఆయన లేని లోటు పూడ్చలేనిదని పలువురు నేతలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
