Let's talk: editor@tmv.in
పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై యుద్ధవిమానాల సాధన

పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై యుద్ధవిమానాల సాధన

Pinjari Chand
23 ఏప్రిల్, 2026

అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్‌ప్రెస్‌వేలను ప్రత్యామ్నాయ రన్‌వేలుగా వినియోగించే పనిలో భాగంగా, ఇండియన్‌ ఎయిర్‌‌ ఫోర్స్‌ రెండు రోజుల ప్రత్యేక సాధన ప్రక్రియను ప్రారంభించింది. ఈ సాధన పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎయిర్‌‌ స్ట్రిప్‌ పై, సుల్తాన్‌పూర్ జిల్లాలోని అర్వాల్–కిరి కార్వట్ ఎయిర్‌స్ట్రిప్ వద్ద జరుగుతోంది.

ఇందులో యుద్ధవిమానాలు ‘టచ్-అండ్-గో’ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో తాత్కాలిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసి విమానాల కదలికలను సమన్వయం చేస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా స్థానిక ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రజలు అపోహలను నమ్మకుండా, భద్రతా పరిధి దాటి రాకూడదని విజ్ఞప్తి చేసింది. రిహర్సల్‌ కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేలో 12 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్‌ను మళ్లించారు. ఈ మళ్లింపు మే 1 వరకు కొనసాగి, మే 2 నుంచి సాధారణ రాకపోకలు పునఃప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఇంతకుముందు కూడా ఇలాంటి సాధనలు నిర్వహించామని, జూన్ 2023లో సుఖోయ్, మిరాజ్ యుద్ధవిమానాలు ఇదే 3.2 కి.మీ ఎయిర్‌స్ట్రిప్‌పై టచ్-అండ్-గో చేశాయని గుర్తుచేశారు. నవంబర్ 2021లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవ సమయంలో కూడా యుద్ధవిమానాలు, హెర్క్యులీస్ విమానం ఇక్కడ ల్యాండింగ్ చేసిన విషయం ప్రస్తావించారు.

అత్యవసర పరిస్థితుల్లో కూడా

జిల్లా కలెక్టర్ ఇంద్రజిత్‌సింగ్‌ స్వయంగా స్థలాన్ని సందర్శించి భద్రత, లాజిస్టిక్స్ ఏర్పాట్లను సమీక్షించారు. ఈసారి పగలు, రాత్రి రెండూ సమయాల్లో సాధన నిర్వహిస్తున్నాం. తక్కువ విజిబిలిటీ ఉన్న అత్యవసర పరిస్థితుల్లో కూడా విమానాలు సురక్షితంగా ల్యాండ్, టేకాఫ్ చేయగల సామర్థ్యాన్ని అంచనా వేయడమే ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఎయిర్‌స్ట్రిప్ చుట్టూ 4–5 కి.మీ పరిధిలో పోలీసులు, భద్రతా సిబ్బందిని మోహరించారు. అనధికార ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. మంగళవారం జరిగిన రిహార్సల్‌లో సుఖోయ్-30 ఎంకేఐ, మిరాజ్-2000, జాగ్వార్, తేజస్ వంటి ఆధునిక యుద్ధవిమానాలు పలుమార్లు టచ్-అండ్-గో సాధన చేయగా, హెలికాప్టర్ల నుంచి ఐఏఎఫ్ కమాండోలు స్లిథరింగ్ ప్రదర్శనలు చేశారు. భద్రతా కారణాల వల్ల ఎయిర్‌స్ట్రిప్ సమీపంలో ప్రజల ప్రవేశాన్ని పరిమితం చేశారు. ట్రాఫిక్ మళ్లింపులను పాటిస్తూ, భద్రతా సూచనలను అనుసరించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.