Let's talk: editor@tmv.in
ములుగులో మహిళా మావోయిస్టు లొంగుబాటు

ములుగులో మహిళా మావోయిస్టు లొంగుబాటు

Gaddamidi Naveen
26 ఏప్రిల్, 2026

సాయుధ పోరాటంతో మార్పు రాదని గ్రహించి, శాంతియుత జీవనం గడపాలనే సంకల్పంతో నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన 18 ఏళ్ల మహిళా సభ్యురాలు శనివారం ములుగు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయింది. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఐపీఎస్ సమక్షంలో ఆమె జనజీవన స్రవంతిలో చేరారు.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బసగూడ పరిధిలోని దల్లా గ్రామానికి చెందిన ముడియం రమే అలియాస్ రాజిత (18), తండ్రి దేవ. సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీలోని 9వ ప్లాటూన్ సభ్యురాలిగా పనిచేసినట్లు పోలీసులు వెల్లడించారు. అదే యూనిట్‌కు చెందిన విజ్జులు అలియాస్ ఐతు (డీకేఎస్‌జెడ్‌సీఎం) నాయకత్వంలో ఆమె పనిచేసినట్లు సమాచారం. ములుగు జిల్లా పోలీసులు ఆదివాసీల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న "యుద్ధం కంటే మళ్లీ మన గ్రామాలకు తిరిగి రండి" అనే చైతన్య కార్యక్రమం ద్వారా ప్రభావితమై ఆమె ఈ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ లొంగుబాటు విధానాన్ని అమలు చేస్తోందని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారికి నగదు బహుమతి, వైద్య సేవలు, పునరావాస ప్యాకేజీతో పాటు సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి పూర్తి మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. లొంగుబాటు ప‌థకంలో భాగంగా రాజితకు రూ.25,000 తక్షణ ఆర్థిక సహాయాన్ని ఎస్పీ అందజేశారు.

ఎస్పీ విజ్ఞప్తి

అడవుల్లో ఉన్న మిగిలిన మావోయిస్టు సభ్యులు కూడా హింసను వీడి ప్రధాన స్రవంతిలోకి రావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇస్తున్నామని, మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం తరపున పూర్తి రక్షణ, పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ములుగులో మహిళా మావోయిస్టు లొంగుబాటు - Tholi Paluku