

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
నగర పరిధిలోని శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. శంషాబాద్‌లోని 16వ ఎగ్జిట్ పాయింట్ వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఒక అతివేగంగా వస్తున్న కారు, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. కారు వేగం ఎక్కువగా ఉండటంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులంతా సిరిసిల్లకు చెందిన వారిగా..హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న పోలీసులు గుర్తించారు. యాదగిరిగుట్టకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అతి వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
