
మిర్యాలగూడలో ఘోర ప్రమాదం..గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఒక నివాస గృహంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కాలాకవాడ ప్రాంతంలో ఉన్న ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒక వృద్ధురాలు, ఒక బాలిక, బాలుడు సహా మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
అగ్నిమాపక శాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 12:30 గంటల సమయంలో కాలాకవాడలోని ఒక ఇంటో మంటలు చెలరేగినట్లు సమాచారం అందింది. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది ఒక ఫైర్ ఇంజిన్‌తో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే ఇంట్లోని సిలిండర్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గురువారం రాత్రి మాకు సమాచారం అందిన వెంటనే ఫైర్ ఇంజిన్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. సిలిండర్ పేలుడు కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నాం. విచారణ పూర్తయిన తర్వాత ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తాం అని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. ఈ ఘటనతో స్థానిక ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
