
కడప జిల్లాలో ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సు - లారీ ఢీకొని ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లా పుల్లంపేట వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీఎస్‌ఆర్టీసికి చెందిన ఒక అల్ట్రా డీలక్స్ బస్సు, ఎదురుగా వస్తున్న లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ భీకర ప్రమాదంలో ఒక చిన్నారి, ఒక విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 16 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున 1:00 నుంచి 1:15 గంటల మధ్య పుల్లంపేట మండలం ఉడుమువారిపల్లి గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. తిరుపతి నుంచి కడప వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును, ఎదురుగా వస్తున్న లోడ్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు కుడి వైపున ఉన్న దాదాపు ఆరు సీట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ భాగంలో కూర్చున్న వారికే తీవ్ర గాయాలు కావడం వల్ల ప్రాణనష్టం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు. లారీ డ్రైవర్ కూడా ఈ ఘటనలో గాయపడ్డాడు. క్షతగాత్రులందరినీ తక్షణమే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి, ఇతర సమీప వైద్య కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి
ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆయన తన గాఢ సాంతాపతాన్ని ప్రకటించారు. గాయపడిన ప్రయాణికులకు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలి. పరిస్థితి విషమంగా ఉన్న వారిని అవసరమైతే తక్షణమే ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించాలి. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాజంపేట ఆసుపత్రి అధికారులతో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలు, రోడ్డు భద్రతా చర్యలు, బస్సు, లారీల వివరాలపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
