
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రభుత్వం తక్షణమే మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని హన్వాడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం తూకం, నాణ్యత పరీక్షలు, రైతులకు అందుతున్న సౌకర్యాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి గ్రామానికి సమీపంలోనే వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం వరి కొనుగోలులో ఆలస్యం జరుగుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తేమ శాతం పేరుతో అనవసరంగా రైతులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, తరుగు పేరుతో ధాన్యాన్ని ఎక్కువగా తగ్గిస్తున్నారని ఆరోపించారు.
అదేవిధంగా ధాన్యం అమ్మిన తర్వాత చెల్లింపులు సమయానికి జరగకపోవడం వల్ల రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కొంతమంది రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు గడిపినా తమ ధాన్యాన్ని తీసుకోవడంలేదని, ఈలోపు వర్షాలు పడితే ధాన్యం తడిసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రైతులకు న్యాయమైన ధర ఇవ్వడంతో పాటు సమయానికి చెల్లింపులు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
