
రైతుల ఆవేదన కూటమి ప్రభుత్వానికి కనబడటం లేదా : వైసీపీ నేత జోగి రమేష్
మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డులో గత 15 రోజులుగా ధాన్యం, మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులను మాజీ మంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ గురువారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో రైతుల ఆవేదనను అడిగి తెలుసుకున్న ఆయన ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
గిట్టుబాటు ధర కరువు
మార్కెట్ యార్డులో నిల్వ ఉన్న ధాన్యం, మొక్కజొన్న రాశులను పరిశీలించిన అనంతరం జోగి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతన్న పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి వెంటనే కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు కోటలు దాటుతున్నా క్షేత్రస్థాయిలో రైతును పట్టించుకునే నాథుడే లేడు అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వ్యవసాయ, సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు ఉండి కూడా రైతుల సమస్యలు పరిష్కరించకపోవడం వారి పనితీరుకు నిదర్శనమని మండిపడ్డారు.
స్థానిక ఎమ్మెల్యే పై విమర్శలు
మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వైఖరిపై జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులు తమ గోడును ఫోన్ ద్వారా విన్నవిస్తుంటే ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం దారుణమన్నారు. "నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేసి ప్రతి పనిలోనూ పావలా వాటాలు తీసుకుంటూ ఆయన 'పావలా ప్రసాదు'గా పేరు తెచ్చుకున్నారు. మైలవరాన్ని కేపీ, పీకేలు కలిసి దోచుకుంటున్నారు" అని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే వ్యవహారశైలిపై స్వయంగా రైతులే అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
బాబు పర్యటనపై ప్రశ్నల వర్షం
రేపు పక్కనే ఉన్న తిరువూరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో 15 రోజులుగా మార్కెట్ యార్డులో పడిగాపులు కాస్తున్న రైతులకు ఆయన ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అన్నదాత కన్నీరు పెడితే ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు.
పోరాటం ఉధృతం చేస్తాం
కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి రైతుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పోరాటాన్ని ఉధృతం చేస్తామని జోగి రమేష్ హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా విభాగం నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
