Let's talk: editor@tmv.in
రైతుల సహకారమే అమరావతి విజయానికి పునాది: సీఎం చంద్రబాబు నాయుడు

రైతుల సహకారమే అమరావతి విజయానికి పునాది: సీఎం చంద్రబాబు నాయుడు

Panthagani Anusha
2 మే, 2026

రాష్ట్ర అభివృద్ధికి భూమి అత్యంత కీలకమని రైతుల స్వచ్ఛంద సహకారంతోనే ప్రగతి వేగవంతం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మే డే, "పేదల సేవలో" కార్యక్రమాల సందర్భంగా కృష్ణా జిల్లా పామిడిముక్కలలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అమరావతి రాజధాని నిర్మాణం నుంచి భారీ పారిశ్రామిక పెట్టుబడుల వరకు రాష్ట్ర పురోగతిపై సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: ప్రపంచానికే ఆదర్శం

అమరావతి గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుత నమూనాగా నిలిచిందని సీఎం కొనియాడారు. కేవలం ప్రభుత్వం నమ్మకంతో 29 వేల మంది రైతులు ఎలాంటి నగదు ఆశించకుండా 33 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధి చేసిన ప్లాట్లు, వార్షిక ఆదాయం (అన్యుటీ) హామీపై రైతులు ఉంచిన విశ్వాసమే ఈ ప్రాజెక్టును గేమ్‌ఛేంజర్‌గా మార్చిందన్నారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రెండో దశలో మరో 16 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం వారి అచంచల విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే రాజధాని ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్ పనులు కూడా ప్రారంభమవుతాయని వెల్లడించారు.

వెల్లువెత్తుతున్న పెట్టుబడులు - ఐటీ విప్లవం

రాష్ట్రంలో పారిశ్రామిక సాంకేతిక విప్లవానికి బాటలు వేస్తున్నామని భవిష్యత్తు అంతా టెక్నాలజీదేనని సీఎం తెలిపారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ కోసం దాదాపు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయని ఇది ఏపీని టెక్నాలజీ రంగంలో అగ్రస్థానానికి తీసుకెళ్తుందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో రిలయన్స్ జియో కూడా రూ. 1.7 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ముందుకు వచ్చిందని వెల్లడించారు. అదేవిధంగా విశాఖపట్నంలో స్టీల్ సిటీ అభివృద్ధి కోసం 3 వేల ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. శారీరక శ్రమ కంటే సాంకేతిక పరిజ్ఞానమే రాబోయే కాలంలో మానవ జీవన ప్రమాణాలను మారుస్తుందని ఆయన ఆకాంక్షించారు.

మౌలిక సదుపాయాల కల్పన

రవాణా రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టులను సీఎం వివరించారు. భారతమాల భారతమాల పరియోజన కింద రూ.574 కోట్లతో రహదారుల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇక మచిలీపట్నం బైపాస్, విజయవాడ–మచిలీపట్నం రహదారులను రెండు వరుసల నుంచి ఆరు వరుసల (సిక్స్ లేన్) రహదారులుగా విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా హైదరాబాద్–మచిలీపట్నం మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం వేగంగా జరుగుతోందని మచిలీపట్నంలో బందరు పోర్ట్ నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

సంక్షేమంలో అగ్రగామి

పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోందని నాయుడు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో 62.4 లక్షల మందికి నెలవారీ పెన్షన్లు అందిస్తున్నామని గత 22 నెలల్లో సంక్షేమ పథకాల కోసం రూ. 63,000 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. కార్మిక సంక్షేమం కోసం రూ. 615 కోట్లు వెచ్చిస్తున్నామని రాష్ట్రవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఆధునిక సౌకర్యాలతో 'లేబర్ అడ్డాల'ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇవి భవిష్యత్తులో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలుగా మారుతాయన్నారు. నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో పెళ్లికి రూ. 25,000, ప్రసవ సాయం కింద రూ. 20,000 ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు,అచ్యుతాపురం, గుంటూరు, శ్రీ సిటీ, కర్నూలు, అమరావతిలో ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణం చేపడతామన్నారు.

విపక్షాలపై ధ్వజం

గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సీఎం వైకాపా నేర స్వభావం వల్ల రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టును దెబ్బతీశారని రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పట్టాలెక్కిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.