
ఖమ్మంలో రైతు ఆశీర్వాద సభ రద్దు.. శిల్పకళా వేదికలో ‘రైతు భరోసా’ పంపిణీ
రాష్ట్రంలోని రైతులకు వానాకాలం పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పథకం నిధుల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రైతు భరోసా పంపిణీ కార్యక్రమాన్ని నేడు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించనుంది. తొలుత ఈ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో "రైతు ఆశీర్వాద సభ"గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేసింది.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచనల మేరకు కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికకు మార్చారు. ఈ మేరకు సభ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నేడు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ప్రత్యక్షంగా, అలాగే వివిధ రైతు వేదికల ద్వారా పాల్గొననున్నారు. రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తూ వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఈ కార్యక్రమం ప్రతిబింబించనుంది.
ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రైతు భరోసా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులకు నిధులు అందించేందుకు ఆర్థిక శాఖ ఇప్పటికే రూ.9 వేల కోట్లను సిద్ధం చేసినట్లు సమాచారం. జులై 15వ తేదీలోపు రాష్ట్రంలోని రైతులందరి ఖాతాల్లో నిధులు పూర్తిగా జమ అయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.
