
ఖరీఫ్ సీజన్‌కు రైతులు సన్నద్ధం.. యూరియా సరఫరాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష
రాబోయే ఖరీఫ్–2026 సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఎరువుల సరఫరా, బఫర్ స్టాక్‌లు, నానో యూరియా వినియోగంపై ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఈ అంశాలపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం సచివాలయంలో ఎరువుల కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఎరువుల నిల్వలు, సరఫరా లక్ష్యాలు
సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 1.46 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ అందుబాటులో ఉందని తెలిపారు. అదనంగా సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు కూడా నిల్వలో ఉన్నాయని చెప్పారు. ఖరీఫ్–2026 సీజన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని 11.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కోరగా, కేంద్రం 10 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితం చేసిందని వెల్లడించారు.
కేంద్రం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నులు, జూలై, ఆగస్టులో నెలకు 1.50 లక్షల మెట్రిక్ టన్నులు, సెప్టెంబర్‌లో 1 లక్ష మెట్రిక్ టన్ను యూరియా అందించనున్నట్లు సమాచారం ఇచ్చిందన్నారు. అయితే ఏప్రిల్‌లో కేటాయించిన 2 లక్షల మెట్రిక్ టన్నులకు బదులుగా 1.53 లక్షల మెట్రిక్ టన్నులే రాష్ట్రానికి చేరాయని, మే నెలలో ఇప్పటివరకు 48,985 మెట్రిక్ టన్నులు మాత్రమే అందినట్లు అధికారులు వివరించారు.
జూన్ తొలి వారం నుంచే వరి నాట్లు ప్రారంభమయ్యే అవకాశమున్నందున మే నెలాఖరుకల్లా కనీసం 3.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కేంద్రం నుంచి కేటాయించిన మిగిలిన యూరియాను అత్యవసరంగా రాష్ట్రానికి తరలించే చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీపై డిమాండ్
రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే యూరియాలో 90 శాతం వాటాను తెలంగాణ రైతులకే కేటాయించాలని మంత్రి డిమాండ్ చేశారు. మన రాష్ట్ర వనరులతో తయారవుతున్న ఎరువులు మన రైతులకు అందకపోవడం అన్యాయమని, దీనిపై రామగుండం ఫ్యాక్టరీ ఎండీకి లేఖ రాయాలని ఆదేశించారు.
నానో యూరియాపై అవగాహన
నానో యూరియా వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించిన మంత్రి, “రైతు నేస్తం” కార్యక్రమం ద్వారా నానో యూరియా వాడుతున్న రైతుల అనుభవాలను ప్రసారం చేయాలని సూచించారు. ఎరువుల కంపెనీలు కూడా ఈ అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. యూరియా అతిగా వాడటం వల్ల నేల సారం దెబ్బతింటుందని, రైతులు నానో యూరియా వైపు మళ్ళాలని మంత్రి కోరారు.
కొత్త యాప్.. కఠిన చర్యలు
కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎరువుల పంపిణీ కోసం రూపొందించిన కొత్త యాప్‌ను మే 21 నుంచి రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఎరువులను ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించే హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రైతులు భూసార పరీక్షలు చేయించుకుని, అవసరమైన మేరకే ఎరువులు వాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్, డిజిటల్ వింగ్ డైరెక్టర్ సరిత లక్ష్మి, వ్యవసాయ డైరెక్టర్ డాక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.
