Let's talk: editor@tmv.in
ఫార్మ్-టు-హోమ్.. వినియోగదారుడి ఇంటికే ఉత్పత్తులు:ఏపీ సీఎం

ఫార్మ్-టు-హోమ్.. వినియోగదారుడి ఇంటికే ఉత్పత్తులు:ఏపీ సీఎం

Panthagani Anusha
28 మే, 2026

రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త విప్లవాత్మక విధానానికి శ్రీకారం చుట్టింది. రైతు నుంచి నేరుగా వినియోగదారుడి ఇంటి వద్దకే వ్యవసాయ ఉత్పత్తులు చేరేలా “ఫార్మ్-టు-హోమ్” విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సచివాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఆరు ప్రాథమిక రంగాల మిషన్లపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మార్కెట్లో మధ్యవర్తుల పాత్రను పూర్తిగా తగ్గించడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా పండ్లు, కూరగాయల సరఫరాలో ఈ విధానం కీలక మార్పు తీసుకువస్తుందని పేర్కొన్నారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్‌ భాగస్వామ్యంతో సమర్థవంతమైన హోమ్ డెలివరీ వ్యవస్థను త్వరితగతిన అభివృద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఎల్‌నినో ముప్పుపై ముందస్తు వ్యూహం.. సహజ వ్యవసాయానికి ప్రాధాన్యం

రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ప్రాంతాల వారీగా ముందస్తు పంటల ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో తక్కువ నీటితో సాగు చేసే పంటలను సహజ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనా రైతులకు నష్టం కలగకుండా చూడాలని, అన్ని పంటలకు కనీస మద్దతు ధర తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా భవిష్యత్తులో రసాయన ఎరువుల కొరత తలెత్తే అవకాశం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సూక్ష్మ పోషకాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. సహజ వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ‘నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’ పథకం కింద ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. రైతు బజార్లు, ప్రైవేట్ మార్కెట్లలో సహజ పద్ధతుల్లో పండించిన ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కోకో సిటీ ఏర్పాటు.. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్

మరోవైపు రాష్ట్రంలో ఉద్యానవన పంటల ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించేలా తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు సమీపంలో “కోకో సిటీ” ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనితో పాటు వ్యవసాయ రంగంలో అత్యాధునిక పరిశోధనల కోసం చిత్తూరు జిల్లా మదనపల్లెలో ప్రతిష్టాత్మక ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు రాబోయే జూలై నెలలోనే శంకుస్థాపన చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

రూ.40 వేల కోట్లతో రాయలసీమ ‘హార్టికల్చర్ హబ్’

వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని పండ్ల తోటల రాజధానిగా మార్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. రూ.40 వేల కోట్ల “పూర్వోదయ” కార్యక్రమం కింద రాయలసీమను ‘హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాంతంలో సాగునీరు, రవాణా కనెక్టివిటీ, గిడ్డంగులు, మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు అదనంగా రూ.60 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు తీసుకురావాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా రాయలసీమలో అరటి పండించే రైతుల ప్రయోజనార్థం అత్యాధునిక కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు.

డ్రోన్ల వినియోగం.. వ్యవసాయ యాంత్రీకరణ

రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు క్లస్టర్ విధానంలో హార్వెస్టర్లు, సీడర్లు వంటి ఆధునిక యంత్రాలను రైతు సాధికార సంస్థ ద్వారా అందుబాటులోకి తేవాలని సీఎం సూచించారు. ‘రైతు యాప్’ ద్వారా లభించే సేవలను మరింత సమగ్రపరచడంతో పాటు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని విరివిగా పెంచాలని ఆదేశించారు. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో సాగునీటి యాజమాన్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఆక్వా, మత్స్యకారులకు భారీ ఊతం.. రూ.188 కోట్ల అదనపు సబ్సిడీ

ఆక్వా రంగానికి ప్రభుత్వం భారీ ఊతమిచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 50 వేల విద్యుత్ సబ్సిడీ కనెక్షన్లతో పాటు కొత్తగా నమోదైన 12,680 కనెక్షన్లకు కూడా విద్యుత్ సబ్సిడీని విస్తరిస్తూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.188 కోట్ల భారం పడనుంది. రాష్ట్రంలోని నాలుగు లక్షల ఎకరాల ఆక్వా సాగును పూర్తిగా ‘ఆక్వా జోన్’ పరిధిలోకి తీసుకురావాలని తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో ట్రేసబిలిటీ, నాణ్యత ధృవీకరణను మెరుగుపరచవచ్చని సీఎం పేర్కొన్నారు.

'డిజి రైతు బజార్'.. పులివెందులలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్

వినియోగదారులకు, రైతులకు అనుసంధానంగా ఉన్న రైతు బజార్ల వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రైతు బజార్లను వేగంగా ఏర్పాటు చేసి, వాటిని డిజిటలైజ్ చేయాలని సీఎం ఆదేశించారు. “డిజి రైతు బజార్” యాప్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఇదే క్రమంలో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో నిర్మాణంలో ఉన్న ‘సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ పనులను తక్షణమే పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశిస్తూ ఇందుకు రూ.3 కోట్ల నిధులను తక్షణమే మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.