
జలమండలిలో ఉద్యోగాల పేరుతో ఫేక్ నోటిఫికేషన్ వైరల్
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (జలమండలి) లో ఉద్యోగాల భర్తీ జరుగుతోందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై జలమండలి ఉన్నతాధికారులు స్పందించారు. ప్రస్తుతం బోర్డులో ఎలాంటి ఉద్యోగ నియామకాలు జరగడం లేదని, సామాజిక మాధ్యమాలలో ప్రచారమవుతున్న సమాచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు.
ఇటీవల కాలంలో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ‘హైదరాబాద్ నీటి సరఫరా బోర్డు, తెలంగాణ రిక్రూట్‌మెంట్-2026’ పేరుతో ఒక నోటిఫికేషన్ పోస్టర్ విపరీతంగా వైరల్ అవుతోంది. జలమండలిలో భారీగా ఉద్యోగాల భర్తీ జరుగుతోందంటూ నిరుద్యోగులను ఆకర్షించేలా ఆ పోస్టర్‌లో పొందుపరిచారు. అయితే, ఈ వైరల్ పోస్టర్‌ను బోర్డు తీవ్రంగా ఖండించింది. తాము ఎలాంటి నియామక ప్రక్రియను చేపట్టలేదని, నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించి మోసం చేయాలనే ఉద్దేశంతో కొంతమంది కేటుగాళ్లు సృష్టించిన నకిలీ పోస్టర్ ఇది అని అధికారులు క్లారిటీ ఇచ్చారు.
టీజీపీఎస్సీ ద్వారానే భర్తీ
జలమండలిలో భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నా.. అది కేవలం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ద్వారానే జరుగుతుందని, దానికి సంబంధించిన అధికారిక ప్రకటనలు కమిషన్ వెబ్‌సైట్ ద్వారానే విడుదలవుతాయని అధికారులు గుర్తుచేశారు. కాబట్టి ఇలాంటి ఫేక్ పోస్టర్లు, తప్పుడు ప్రకటనలను నమ్మి నిరుద్యోగులు ఎవరూ మోసపోవద్దని, ఏదైనా అనుమానం ఉంటే అధికారిక వనరులను మాత్రమే సంప్రదించాలని జలమండలి అధికారులు హెచ్చరించారు.
