
నకిలీ పత్తి విత్తనాల రాకెట్ గుట్టురట్టు.. రూ.30 లక్షల సామగ్రి స్వాధీనం
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తరుణంలో నకిలీ వ్యవసాయ ఉత్పాదకాల విక్రయాలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ, తిరుమలగిరి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో ఒక నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టయింది. వారి వద్ద నుంచి రూ. 30 లక్షల విలువైన 12,800 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు, దాదాపు 2,000 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన 'నర్మదా సాగర్ అగ్రి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్' మార్కెటింగ్ మేనేజర్ సోలంకే యశ్వంత్ రావు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దర్యాప్తు ప్రారంభమైంది. హైదరాబాద్‌కు చెందిన న్యూ రైతు సంపద సీడ్స్ కంపెనీ ఎండీ యెరువ బాలశౌరి రెడ్డి అలియాస్ శివారెడ్డి.. తమ కంపెనీ బ్రాండ్‌ను పోలిన నకిలీ ప్యాకెట్లను చట్టవిరుద్ధంగా ముద్రించి, ఎలాంటి అనుమతులు లేకుండా నకిలీ విత్తనాలను మార్కెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులు అందిన సమాచారం మేరకు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్ యార్డ్ వద్ద పోలీసులు ఒక మారుతి ఈకో వాహనాన్ని అడ్డుకున్నారు. అందులో తరలిస్తున్న 12,800 నకిలీ ప్యాకెట్లను గుర్తించి, వాహనంలో ఉన్న యెరువ బాలశౌరి రెడ్డి, అతని ఉద్యోగి కపర్తి బెంజిమెన్, డిజైనర్ డొంగా శ్రీను అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా అక్రమ లాభాల కోసం ఈ కుట్ర పన్నినట్లు వెల్లడైంది. డొంగా శ్రీను రూపొందించిన డిజైన్ ఆధారంగా మెదక్ జిల్లా బహదూర్‌పల్లిలోని ఒక ప్రింటింగ్ సంస్థలో నకిలీ ప్యాకెట్లు ముద్రించినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే రైతుల నుంచి సేకరించిన సుమారు 2,000 కిలోల విత్తనాలను బండ్లగూడలోని కార్యాలయంలో నిల్వ ఉంచి వాటిని నకిలీ ప్యాకెట్లలో నింపేందుకు సిద్ధం చేసినట్లు తేలింది.
నిందితుడి సమాచారంతో బండ్లగూడ కార్యాలయంపై దాడి చేసిన పోలీసులు విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అదనంగా ఒక మారుతి ఈకో వాహనం, మూడు మొబైల్ ఫోన్లను కూడా జప్తు చేసి నిందితులపై కేసు నమోదు చేశారు.
