Let's talk: editor@tmv.in
కొనుగోలు కేంద్రాల్లో అడుగడుగునా వైఫల్యం: ఎన్. రామ‌చందర్ రావు

కొనుగోలు కేంద్రాల్లో అడుగడుగునా వైఫల్యం: ఎన్. రామ‌చందర్ రావు

Gaddamidi Naveen
26 మే, 2026

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి వల్ల ధాన్యం కొనుగోళ్లు అత్యంత నత్తనడకన సాగుతున్నాయని తెలంగాణ బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. రైతుల నుంచి త్వరితగతిన పంటలను కొనుగోలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ మూడు రోజుల పాటు ‘రైతు గోస – బీజేపీ భరోసా’ కార్యక్రమంలో కొనుగోలు కేంద్రాల సందర్శన కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామ‌చందర్ రావు నేతృత్వంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వికారాబాద్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లోని పరిస్థితులను స్వయంగా పరిశీలించిన బీజేపీ నేతలు రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

రామ‌చందర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్లను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రెండు నెలల క్రితమే బీజేపీ కిసాన్ మోర్చా తరఫున వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినప్పటికీ ఎటువంటి సముచిత చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రతి కొనుగోలు కేంద్రంలో ధాన్యం గుట్టలుగా పేరుకుపోయి కొనుగోలు చేయకుండానే నిల్వగా ఉండిపోయిందని ఆయన పేర్కొన్నారు. సుమారు 15 రోజులుగా రైతులు ఎదురు చూస్తున్నారని, గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు తగినంతగా అందుబాటులో లేకపోవడంతో పంటను రక్షించుకోవడంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

బీజేపీ నేతల పర్యటన సమాచారం రావడంతో ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం కొంతమంది అధికారులు హడావుడిగా ధాన్యాన్ని సంచుల్లో నింపి మిల్లులకు తరలించారని ఆయ‌న‌ ఆరోపించారు. ఇది రైతులను తప్పుదోవ పట్టించడమేనని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. గత 45 రోజులుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. సీఎం మాత్రం సచివాలయంలో ఏసీ రూముల్లో కూర్చుని సమీక్షలు చేస్తున్నారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదైనా ఒక జిల్లాకు వచ్చి రైతుల కష్టాలను స్వయంగా చూడాలి. రేవంత్ రెడ్డి రైతు కాదు.. ఆయన ఒక రియల్టర్. భూమిని ఎలా చదరపు గజాలుగా మార్చాలి, ఎలా అమ్మాలో మాత్రమే ఆయనకు తెలుసు. ఈ మాట స్వయంగా ఆయనే గతంలో చెప్పుకున్నారని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ తెలంగాణ రైతులను మోసం చేశారు

మరో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణ రైతులను ఘోరంగా మోసం చేశారు. ఎన్నికల ముందు మీరు ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమైంది? ఇచ్చిన హామీలను నెరవేర్చండి. అవి కేవలం ప్రకటనలు కావు, గ్యారెంటీలు అని చెప్పారు కదా.. ఇప్పుడు ఆ గ్యారెంటీలు ఎటు పోయాయి? అని విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

ఆరోపణలను ఖండించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఇదిలా ఉండగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 51 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు చెల్లింపులు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు రైతులకు సుమారు రూ.45,000 కోట్ల చెల్లింపులు జరిగాయని ఆయన వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో మొత్తం 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేదని, ఇప్పటికే 21 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేపట్టిందని ఆయన తెలిపారు.