Let's talk: editor@tmv.in
గాదె సాయికృష్ణ అదృశ్యంపై వాస్తవాలు వెలికితీయాలి: వైసీపీ నేతలు

గాదె సాయికృష్ణ అదృశ్యంపై వాస్తవాలు వెలికితీయాలి: వైసీపీ నేతలు

Gaddamidi Naveen
17 జూన్, 2026

కృష్ణలంక ప్రాంతానికి చెందిన గాదె సాయికృష్ణ గత కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో ఆయన ఆచూకీని వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయాలని, ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా అడ్మిన్ డీసీపీకి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితర నేతలు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాతే ఆయన కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని తెలిపారు. కోర్టు కూడా సాయికృష్ణను తమ ముందుకు హాజరుపరచాలని ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. సాయికృష్ణ ఎలాంటి వాడైనా శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. విజయవాడ పోలీసులు సివిల్, స్టేషన్ సెటిల్‌మెంట్లతో బిజీగా ఉన్నారని విమర్శించారు.

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, సాయికృష్ణను ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లారని ఆయన తల్లి చెబుతున్నారని, కుటుంబ సభ్యులు తమకు అందిన సమాచారం ఆధారంగానే పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. సాయికృష్ణ ఎక్కడ ఉన్నారనే విషయంపై పోలీసులు మౌనం వీడి నిజాలు వెల్లడించాలని కోరారు. ఈ అంశంపై ప్రభుత్వం, హోంమంత్రి స్పందించాలని, బాధిత కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, సాయికృష్ణ అదృశ్యం, కుటుంబ సభ్యుల ఆరోపణలపై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.