Let's talk: editor@tmv.in
తాడ్వాయిలో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అరెస్ట్

తాడ్వాయిలో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అరెస్ట్

Gaddamidi Naveen
24 జూన్, 2026

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో యూరియా యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ నాయకత్వంలో వేలాది మంది రైతులు ధర్నాలో పాల్గొనేందుకు సిద్ధమవగా, పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.

ఉదయం నుంచే తాడ్వాయి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సాధారణ వ్యక్తిలా బైక్‌పై తాడ్వాయికి చేరుకున్న జాజాల సురేందర్, రైతుల మధ్యకు వెళ్లి ధర్నాలో పాల్గొనేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆయన జై బీఆర్ఎస్, జై తెలంగాణ అంటూ నినాదాలు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో ఎక్కించి బీర్కూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సురేందర్ అరెస్టు నేపథ్యంలో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

ఇదిలా ఉండగా తాడ్వాయి చౌరస్తా వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పలువురు నేతలు, రైతులను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. రైతుల సమస్యలపై శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు వచ్చిన తమను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించగా, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే చర్యలు తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనతో తాడ్వాయి మండలంలో రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ట్యాగ్‌లు
UreaAppUreaAppCancelFarmersProtestFarmersIssuesTelanganaFarmersFarmerRightsTadwaiKamareddyBRSBRSPartyJajalaSurenderTelanganaPolitics
తాడ్వాయిలో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అరెస్ట్ - Tholi Paluku