Let's talk: editor@tmv.in
తీవ్ర వడగాలులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఏపీ సీఎం

తీవ్ర వడగాలులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఏపీ సీఎం

Panthagani Anusha
24 మే, 2026

రాష్ట్రంలో తీవ్రస్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలుల ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రజారోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసిన సీఎం, ఎండల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలకు నిరంతరం హెచ్చరికలు సూచనలు పంపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరిస్థితుల తీవ్రతను బట్టి స్థానికంగా సెలవులు ప్రకటించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించారు.

తీవ్రస్థాయి ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో హీట్‌వేవ్ తీవ్రత గణనీయంగా పెరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, ప్రజలకు ఉపశమనం కలిగించేలా రద్దీ ప్రాంతాలు, బస్టాండ్లు, మార్కెట్లు వంటి చోట్ల చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వడగాలుల నుంచి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లా కలెక్టర్లు మీడియా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా నిరంతరం సమాచారాన్ని చేరవేయాలని నిర్దేశించారు.

ప్రజల ప్రాణాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్న సీఎం ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్లు, మండల స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 1,349 హీట్ షెల్టర్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా 446 ట్రాఫిక్ జంక్షన్లలో వాహనదారులు, ట్రాఫిక్ పోలీసులకు నీడ కల్పించే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

మరోవైపు ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న మూగజీవులు, పక్షుల కోసం కూడా నీటి తొట్టెలు, మట్టి కుండల ద్వారా తాగునీరు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు.

2015లో బలమైన ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో 50.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటివరకు 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకు పెరిగినట్లు వివరించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పచ్చదనం పెంపుపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. భూగర్భ జలాలు పెరిగితే పచ్చదనం కూడా పెరుగుతుందని తద్వారా తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావం కొంత మేర తగ్గుతుందని పేర్కొన్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే అన్నమయ్య జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అక్కడి పచ్చదనం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. వచ్చే వారం రోజుల పాటు ప్రజలను అప్రమత్తం చేసి విస్తృత కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్‌తో పాటు పురపాలక, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, విపత్తు నిర్వహణ, వైద్యారోగ్య శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.