Let's talk: editor@tmv.in
రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనివేళలు పొడిగింపు

రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనివేళలు పొడిగింపు

Gaddamidi Naveen
29 మే, 2026

రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను వాస్తవ ధరలకు అనుగుణంగా క్రమబద్ధీకరించాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయంతో రిజిస్ట్రేషన్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల పని వేళలను పొడిగిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 29వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు కార్యాలయాలు ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు పనిచేయనున్నట్లు తెలిపారు.

రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వేగం, పారదర్శకత, సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అదేవిధంగా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్లాట్ బుకింగ్‌ల సంఖ్యను కూడా పెంచాలని అధికారులకు సూచించారు. రిజిస్ట్రేషన్ డిమాండ్ మరింత పెరిగితే అవసరమైతే అదనపు సమయంతో పాటు మరిన్ని రోజులు కూడా పని వేళలను పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. ప్రజలు ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ సేవలు పొందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.