
ప్రభుత్వ పాఠశాలల్లో 2029 వరకు ‘రాగి జావ కార్యక్రమం’ పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం మరియు పోషకాహార భద్రత దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత మూడేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతున్న 'రాగి జావ' కార్యక్రమాన్ని మరో ఐదేళ్ల పాటు అంటే ఏప్రిల్ 2029 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మధ్య అవగాహన ( ఎంవోయూ) ఒప్పందం కుదిరింది.
విజయవాడలో జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ పాల్గొని ఒప్పంద పత్రాలను పరస్పరం మార్పిడి చేసుకున్నారు. విద్యార్థుల సంక్షేమమే పరమావధిగా వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిరంతరాయంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు ఇద్దరు నేతలు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా బోధనల స్ఫూర్తితో ప్రారంభమైన ఈ పథకం సామాజిక సేవే లక్ష్యంగా కొనసాగుతోందని వారు పేర్కొన్నారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత మూడు సంవత్సరాలుగా అమలవుతున్న ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన ఫలితాలను సాధించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు 44 వేల ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 30 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిరోజూ ఉదయం ఈ పోషక పానీయాన్ని పొందుతున్నారు. ఈ కార్యక్రమం కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా క్షేత్ర స్థాయిలో విద్యార్థుల శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో వారి హాజరు శాతాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించిందని అధికారులు వెల్లడించారు.
ఈ పథకం అమలులో శ్రీ సత్య సాయి ట్రస్ట్ పాత్ర ఎంతో కీలకమైనది. ట్రస్ట్ తరపున ఉచితంగా నాణ్యమైన రాగి పిండి, బెల్లాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. పాఠశాలల్లో వీటిని ఉపయోగించి ప్రతి రోజూ తాజాగా పోషక విలువలతో కూడిన రాగి జావను తయారు చేసి విద్యార్థులకు అందిస్తున్నారు. రాగి, బెల్లం వల్ల పిల్లలకు అవసరమైన ఐరన్, కాల్షియం ఇతర మైక్రో న్యూట్రియెంట్స్ అందుతాయని ఇది విద్యార్థులలో రక్తహీనతను తగ్గించి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం విద్యార్థుల శారీరక ఆరోగ్యంతో పాటు వారి చదువుపై ఏకాగ్రతను తరగతుల్లో పాల్గొనే ఉత్సాహాన్ని కూడా పెంచిందని కొనియాడారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి ఈ పథకాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్న శ్రీ సత్య సాయి ట్రస్ట్‌కు ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. 2029 వరకు ఈ ఒప్పందాన్ని పొడిగించడం ద్వారా ప్రతి విద్యార్థికి సరైన పోషకాహారం అందేలా చూస్తూ వారిని ఆరోగ్యవంతులైన పౌరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
