Let's talk: editor@tmv.in
ఎక్స్‌ప్రెస్‌వేలు ప్రమాద కారిడార్లు కాకూడదు: సుప్రీంకోర్టు
ఎక్స్‌ప్రెస్‌వేలు ప్రమాద కారిడార్లు కాకూడదు: సుప్రీంకోర్టు

ఎక్స్‌ప్రెస్‌వేలు ప్రమాద కారిడార్లు కాకూడదు: సుప్రీంకోర్టు

Shaik Mohammad Shaffee
20 ఏప్రిల్, 2026

దేశంలోని ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులు పరిపాలనాపరమైన నిర్లక్ష్యం వల్ల ప్రాణాంతక కారిడార్లుగా మారకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు సర్వోన్నత న్యాయస్థానం దేశవ్యాప్తంగా వర్తించేలా కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ ఎ.ఎస్. చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇస్తూ.. రహదారులపై అక్రమంగా వాహనాలను పార్క్ చేయడం, మౌలిక సదుపాయాల లోపాల వల్ల ఒక్క ప్రాణం పోయినా అది ప్రభుత్వ వైఫల్యమేనని అభివర్ణించింది.

రాజ్యాంగబద్ధమైన బాధ్యత

ఆర్టికల్ 21 ప్రకారం పౌరులకు ఉన్న 'జీవించే హక్కు' కేవలం ప్రాణాలను రక్షించడమే కాదని, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం కూడా ప్రభుత్వ బాధ్యతని ధర్మాసనం గుర్తుచేసింది. జాతీయ రహదారులు దేశంలోని మొత్తం రోడ్డు నెట్‌వర్క్‌లో కేవలం 2 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, 30 శాతం మరణాలు అక్కడే సంభవిస్తుండటంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిధుల కొరత, పరిపాలనాపరమైన ఇబ్బందులు ఏవీ కూడా మానవ ప్రాణం కంటే ముఖ్యం కాదని అత్యున్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది.

తీర్పు వెనుక నేపథ్యం

గత ఏడాది నవంబర్ 2, 3 తేదీల్లో రాజస్థాన్‌లోని ఫలోది, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. వ్యవస్థాగత నిర్లక్ష్యం, మౌలిక సదుపాయాల వైఫల్యమే ఈ మరణాలకు కారణమని గుర్తించింది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో ఇలాంటి అనర్థాలు జరగకుండా దేశవ్యాప్త మార్గదర్శకాలు అవసరమని భావించి, ఆర్టికల్ 142 కింద ఉన్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

హైవేలపై ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తే జరిమానా

జాతీయ రహదారులపై ఎక్కడ పడితే అక్కడ లారీలు, ఇతర వాణిజ్య వాహనాలను ఆపడంపై కోర్టు పూర్తి నిషేధం విధించింది. వాహనాలను కేవలం ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక పార్కింగ్ స్థలాల వద్ద మాత్రమే ఆపాలని పేర్కొంది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే, హైవేలపై ఉండే అత్యాధునిక కెమెరాల ద్వారా వాహనం ఫోటోతో సహా వెంటనే పోలీసులకు సమాచారం వెళ్తుంది. దీనివల్ల నేరుగా ఆన్‌లైన్ ద్వారా జరిమానా (ఈ-చలాన్) విధించడం జరుగుతుంది. రహదారులపై అడ్డదిడ్డంగా వాహనాలు ఆపడం వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశ్యం.

ఆక్రమణల తొలగింపునకు గడువు

హైవేల వెంబడి రైట్ ఆఫ్ వే పరిధిలో కొత్తగా డాబాలు, హోటళ్లు, ఏవైనా వాణిజ్య నిర్మాణాల ఏర్పాటును కోర్టు నిషేధించింది. ఇప్పటికే ఉన్న అనధికార నిర్మాణాలను 60 రోజుల్లోగా జిల్లా మెజిస్ట్రేట్లు తొలగించాలని ఆదేశించింది. అలాగే హైవే సేఫ్టీ జోన్లలో ఎన్‌హెచ్ఏఐ, పీడబ్ల్యూడీ అనుమతి లేకుండా ఎలాంటి కొత్త లైసెన్సులు, ఎన్ఓసీలు ఇవ్వకూడదని, ఉన్న లైసెన్సులను 30 రోజుల్లోగా సమీక్షించాలని స్పష్టం చేసింది.

జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్

ప్రతి జిల్లాలో జాతీయ రహదారులు వెళ్లే ప్రాంతాల్లో 15 రోజుల్లోగా 'జిల్లా రహదారి భద్రత టాస్క్‌ఫోర్స్' ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే ఈ టీమ్‌లో పోలీస్ ,ఎన్‌హెచ్ఏఐ, పీడబ్ల్యూడీ అధికారులతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉండాలి. ఈ టాస్క్‌ఫోర్స్ ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తూ, అక్రమ పార్కింగ్, బ్లాక్ స్పాట్స్ (ప్రమాదకర ప్రాంతాలు) వంటి అంశాలపై నిఘా ఉంచాలని సూచించింది.

టెక్నాలజీ వినియోగం - మౌలిక సదుపాయాలు

హైవేలపై భద్రత కోసం సీసీ కెమెరాలు, స్పీడ్ డిటెక్టర్లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్‌తో కూడిన ఏటీఎంఎస్‌ను వెంటనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కోర్టు పేర్కొంది. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ వద్ద లైటింగ్ సౌకర్యం కల్పించాలని, ట్రక్ లే-బై వసతులను నిర్మించాలని ఆదేశించింది. ఈ పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు జిల్లా మెజిస్ట్రేట్లు ఒక ఎస్ఓపిని రూపొందించాలని కోర్టు నిర్దేశించింది.

75 రోజుల్లోగా నివేదిక

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాల అమలుపై వివిధ రాష్ట్రాలు, ఏజెన్సీల నుంచి డేటాను సేకరించి 75 రోజుల్లోగా సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. నిబంధనల అమలులో ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత పక్షాలు కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను రెండు నెలల తర్వాతకు వాయిదా వేసింది.