Let's talk: editor@tmv.in
రిటైర్డ్ న్యాయమూర్తుల అనుభవాన్ని వినియోగించాలి: సీజేఐ సూర్యకాంత్

రిటైర్డ్ న్యాయమూర్తుల అనుభవాన్ని వినియోగించాలి: సీజేఐ సూర్యకాంత్

Pinjari Chand
26 ఏప్రిల్, 2026

భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ శనివారం రిటైర్డ్ న్యాయమూర్తుల అనుభవాన్ని సమర్థంగా వినియోగించుకునేందుకు ఒక సమగ్ర జాతీయ వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార (ఏడీఈర్‌‌) వ్యవస్థల్లో మాజీ న్యాయమూర్తుల సేవలను ఉపయోగించేందుకు ప్రత్యేక జాతీయ రిజిస్ట్రీ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. రిటైర్డ్ జడ్జిల సదస్సులో ప్రసంగించిన సీజేఐ పదవీ విరమణ తర్వాత వారి అనుభవం వృథా కాకూడదు. అది దేశానికి అమూల్యమైన వనరు అని చెప్పారు. ఈ అనుభవాన్ని వ్యవస్థీకృతంగా వినియోగించేందుకు నేషనల్ రిజిస్ట్రీ, హైకోర్టులు–రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీల మధ్య అవగాహన ఒప్పందాలు (ఎంఓయూస్‌) అవసరమని తెలిపారు. మధ్యవర్తిత్వం (మీడియేషన్), లోక్ అదాలత్‌లు, ఆర్బిట్రేషన్, కన్‌సిలియేషన్ వంటి ఏడీఆర్‌‌ పద్ధతులు ప్రజలకు వేగంగా, సులభంగా న్యాయం అందించే ప్రధాన మార్గాలని సీజేఐ పేర్కొన్నారు. ఇవి న్యాయవ్యవస్థకు ప్రత్యామ్నాయం మాత్రమే కాదు, అనేక మందికి ఇదే అసలు న్యాయమని ఆయన అన్నారు.

రిటైర్డ్ జడ్జిల పాత్రను వివరిస్తూ

• మధ్యవర్తులు, ఆర్బిట్రేటర్లుగా పనిచేయవచ్చు

• న్యాయ విద్యా ప్రచారకులుగా సేవలు అందించవచ్చు

• కేసులు కోర్టులకు వెళ్లకముందే పరిష్కరించే ప్రీ-లిటిగేషన్ కౌన్సిలర్లుగా వ్యవహరించవచ్చు

• కొత్త న్యాయవాదులు, మధ్యవర్తులకు మార్గదర్శకులుగా నిలవవచ్చు

దేశంలో ఇప్పటికే ఏడీఆర్‌‌ వ్యవస్థ బలోపేతానికి చర్యలు జరుగుతున్నాయని, లోక్ అదాలత్‌ల ద్వారా భారీ స్థాయిలో కేసులు పరిష్కారమవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం భజన్‌లాల్ శర్మ మాట్లాడుతూ, న్యాయమూర్తుల తీర్పులు సమాజంలో సానుకూల మార్పులకు దోహదపడుతున్నాయని చెప్పారు. వివాదాలను కోర్టులకు తీసుకెళ్లే ముందు మధ్యవర్తిత్వ కేంద్రాలను ఆశ్రయించాలని ప్రజలకు సూచించారు. రాజస్థాన్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సంజీవ్ ప్రకాశ్ శర్మ మాట్లాడుతూ, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రజలకు న్యాయం అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా రాజస్థాన్ హైకోర్టు కొత్త యూనిఫామ్ రిజిస్ట్రేషన్ నంబర్ వ్యవస్థను ప్రారంభించగా, మాజీ న్యాయమూర్తులు రచించిన వ్యాసాల సంకలనాన్ని విడుదల చేశారు.

రిటైర్డ్ న్యాయమూర్తుల అనుభవాన్ని వినియోగించాలి: సీజేఐ సూర్యకాంత్ - Tholi Paluku