
స్బేర్ బ్యాంక్ ‘గిగాచాట్ ఎఐ’ సేవలను భారత్‌కు విస్తరించండి: మంత్రి నారా లోకేష్
రష్యా ప్రభుత్వ నియంత్రిత ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ అయిన ‘స్బేర్‌బ్యాంక్’ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్‌తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్‌లో బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రిటైల్ రంగాల్లో స్బేర్‌బ్యాంక్ అభివృద్ధి చేసిన గిగాచాట్ ఎల్‌ఎల్‌ఎం సేవలను విస్తరించాలని లోకేష్ కోరారు.
భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అయిన యూపీఐ భద్రతను మరింత బలోపేతం చేయడానికి స్బేర్‌బ్యాంక్ అధునాతన వాయిస్ రికగ్నిషన్, బయోమెట్రిక్ ఆధారిత యాంటీ-ఫ్రాడ్ సాంకేతికతను భారత బ్యాంకింగ్ మౌలిక సదుపాయాల్లో అనుసంధానం చేసేందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా ప్రిడిక్టివ్ అనలిటిక్స్, స్మార్ట్ ట్రాన్సిట్ సర్వైలెన్స్, డిజిటల్ సేఫ్టీ వ్యవస్థలను భారత నగరాల్లో విస్తరించాలని సూచించారు.
ప్రపంచ స్థాయి సాఫ్ట్‌వేర్, ఏఐ నిపుణులను తయారు చేయడానికి స్బేర్‌బ్యాంక్ నిర్వహిస్తున్న “స్కూల్ 21” కోడింగ్ అకాడమీలను భారతదేశంలోని ప్రధాన విద్యా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. అంతేకాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులకు రూపాయి-రూబుల్ వాణిజ్య సౌకర్యాలు, వ్యవస్థీకృత రుణాలను అందించాలని విజ్ఞప్తి చేశారు.
దీనికి స్పందించిన ఆల్బర్ట్ యెఫిమోవ్, న్యూఢిల్లీ, ముంబై కార్యాలయాల ద్వారా భారత్-రష్యా వాణిజ్య, కార్పొరేట్ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నామని తెలిపారు. బెంగళూరులోని తమ ఐటీ కేంద్రం సరిహద్దు వాణిజ్య పరిష్కారాలు, రూపాయి-రూబుల్ లావాదేవీల సమన్వయానికి కీలక కేంద్రంగా పనిచేస్తోందన్నారు. గ్లోబల్ బ్యాంకింగ్ నెట్‌వర్క్ ద్వారా అంతర్జాతీయ వాణిజ్య సలహాలు, డిజిటల్ భద్రతా సేవలు, కార్పొరేట్ ఫైనాన్స్ సదుపాయాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి లోకేష్ చేసిన ప్రతిపాదనలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
మాస్కో కేంద్రంగా పనిచేస్తున్న స్బేర్‌బ్యాంక్‌కు ప్రపంచవ్యాప్తంగా 110 మిలియన్లకు పైగా రిటైల్ ఖాతాదారులు, 3.5 మిలియన్ల కార్పొరేట్ కస్టమర్లు ఉన్నారు. 12 వేల శాఖలు, 2.87 లక్షల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ బ్యాంకింగ్‌తో పాటు క్లౌడ్ సేవలు, కృత్రిమ మేధస్సు రంగాల్లో కూడా ప్రముఖ స్థానం కలిగి ఉంది.
