Let's talk: editor@tmv.in
హేట్‌స్పీచ్‌పై ఇప్పుడున్న చట్టాలే సరిపోతాయి: సుప్రీంకోర్టు

హేట్‌స్పీచ్‌పై ఇప్పుడున్న చట్టాలే సరిపోతాయి: సుప్రీంకోర్టు

Pinjari Chand
30 ఏప్రిల్, 2026

దేశవ్యాప్తంగా విద్వేష ప్రసంగాన్ని (హేట్ స్పీచ్‌) నియంత్రించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు, ఆదేశాలు జారీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై చట్టాలు రూపొందించడం న్యాయవ్యవస్థ పరిధి కాదని, అది పూర్తిగా శాసనసభ (లెజిస్లేచర్) పరిధిలోని అంశమని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు విక్రమ్‌నాథ్, సందీప్ మెహతా సభ్యులుగా ఉన్న ధర్మాసనం, హేట్ స్పీచ్‌పై మార్గదర్శకాలు ఇవ్వాలని కోరిన పిటిషన్లను కొట్టివేసింది. ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానిస్తూ, హేట్ స్పీచ్ వంటి నేరాలను ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఉన్న క్రిమినల్ చట్టాలు సరిపోతాయని తెలిపింది. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు, పరస్పర విద్వేషాలను ప్రేరేపించే నేరాలను ఇప్పటికే ఉన్న చట్టాలు కవర్ చేస్తున్నాయని పేర్కొంది. హేట్ స్పీచ్‌కు సంబంధించి కొత్త నేరాన్ని సృష్టించడం న్యాయవ్యవస్థ పరిధిలోకి రాదని, అది పూర్తిగా శాసనసభ పని అని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, సామాజిక మార్పులను దృష్టిలో పెట్టుకుని అవసరమైతే కొత్త చట్టాలు తీసుకురావాలా? సవరణలు చేయాలా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించవచ్చని కోర్టు సూచించింది.

పోలీసులు చర్య తీసుకోకపోతే మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించవచ్చు

పిటిషనర్ల అసలు సమస్య చట్టం లేకపోవడం కాదని, ఉన్న చట్టాల అమలులో లోపాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కారణంగా చట్టాన్ని న్యాయవ్యవస్థ రూపొందించడానికి కారణం కాదని తెలిపింది. భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌) ప్రకారం, తీవ్రత ఎక్కువగా ఉన్న (కాగ్నిజబుల్) నేరాల్లో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌‌ నమోదు చేయాల్సిన బాధ్యత ఉందని, పోలీసులు చర్య తీసుకోకపోతే మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించవచ్చని కోర్టు గుర్తు చేసింది. తీర్పులో కోర్టు ఇంకా ఇలా పేర్కొంటూ హేట్ స్పీచ్‌లు, అపోహలు వ్యాప్తి చేయడం వంటి సమస్యలు సమాజంలో సోదరభావం, గౌరవం, రాజ్యాంగ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. అందువల్ల కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైతే కొత్త చట్టాలు, సవరణలను పరిశీలించవచ్చని సూచించింది. 2017 మార్చి 23న లా కమిషన్ ఇచ్చిన నివేదికను కూడా ఈ సందర్భంలో పరిగణనలోకి తీసుకోవచ్చని తెలిపింది. 2018లో సుప్రీంకోర్టు హేట్ క్రైమ్‌లు, మాబ్ లించింగ్ వంటి ఘటనలను నియంత్రించేందుకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, బాధితులకు పరిహారం, కఠిన శిక్షలు, నిర్లక్ష్యం చూపిన అధికారులపై చర్యలు వంటి అంశాలు ఉన్నాయి. అలాగే ప్రతి రాష్ట్రంలో హేట్ క్రైమ్‌లను పర్యవేక్షించేందుకు నోడల్ అధికారులను నియమించాలని, ఎఫ్‌ఐఆర్‌‌లు వెంటనే నమోదు చేయాలని అప్పట్లో కోర్టు ఆదేశించింది.