



లేహ్‌లో బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన
కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆరాధించే గౌతమ బుద్ధుని పవిత్ర 'పిప్రావా' అవశేషాలు బుధవారం లేహ్‌కు చేరుకున్నాయి. ఢిల్లీ నుంచి ప్రత్యేక వాయుసేన విమానంలో వచ్చిన ఈ పవిత్ర అవశేషాలకు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఇతర ప్రముఖులతో కలిసి భక్తిశ్రద్ధలతో అంజలి ఘటించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో లేహ్ నగరం జనసందొహంగా మారింది.
బుద్ధుని పవిత్ర అస్థికలను ద్రుక్పా తుక్సే రింపోచే, ఖేన్పో థిన్లాస్ చోసల్ ఆధ్వర్యంలో లేహ్‌కు తీసుకువచ్చారు. వీరికి విమానాశ్రయంలోనే లడఖ్ పోలీసులు 'గార్డ్ ఆఫ్ ఆనర్'తో గౌరవ వందనం సమర్పించారు. బౌద్ధ భిక్షువులు సాంప్రదాయ ప్రార్థనలు నిర్వహిస్తుండగా.. ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా పవిత్ర కలశాన్ని భక్తిశ్రద్ధలతో అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, లడఖ్ బౌద్ధ అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ మత పెద్దలు పాల్గొన్నారు. అనంతరం విమానాశ్రయం నుంచి జీవెత్సల్ వరకు భారీ శోభాయాత్ర నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన వేలాది మంది భక్తులు దారిపొడవునా నిలబడి బుద్ధుని అవశేషాలకు నీరాజనాలు పలికారు.
సందర్శన వివరాలు
మే 1న బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఈ పవిత్ర అవశేషాల బహిరంగ ప్రదర్శన ప్రారంభం కానుంది. అనంతరం మే 2 నుంచి 10 వరకు లేహ్‌లోని జీవెత్సల్ మైదానంలో, మే 11-12 తేదీల్లో జంస్కార్ ప్రాంతంలో భక్తులు వీటిని దర్శించుకోవచ్చు. తిరిగి మే 13, 14 తేదీల్లో లేహ్‌లోని ధర్మ సెంటర్‌లో సందర్శనార్థం ఉంచి, మే 15వ తేదీన ఈ పవిత్ర ధాతువులను తిరిగి ఢిల్లీకి తరలిస్తారు.
చారిత్రక నేపథ్యం
ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ నగర్ జిల్లాలో గల పిప్రావా వద్ద 1898లో జరిగిన తవ్వకాల్లో ఈ పవిత్ర అవశేషాలు లభించాయి. ఇవి బుద్ధుని అసలైన శరీర భాగాలని పురావస్తు శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. వీటితో పాటు లభించిన విలువైన రత్నాలు, ఇతర వస్తువులు సుమారు 127 ఏళ్ల పాటు బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండగా.. కేంద్ర ప్రభుత్వం చొరవతో జూలై 2025లో అవి తిరిగి భారత్‌కు చేరాయి. ఇప్పటివరకు థాయిలాండ్, మంగోలియా, శ్రీలంక వంటి దేశాల్లో వీటిని ప్రదర్శించగా, దేశీయంగా ఒక రాష్ట్రం నుంచి మరో ప్రాంతానికి తరలించి ప్రదర్శించడం ఇదే తొలిసారి.
ప్రముఖుల రాక.. పటిష్ట ఏర్పాట్లు
ఈ మహత్కార్యాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బౌద్ధ దేశాల రాయబారులు లేహ్‌ను సందర్శించనున్నారు. భక్తుల కోసం లేహ్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎటు చూసినా మొక్కలు, పూల కుండీలు, ఆధ్యాత్మిక తోరణాలతో నగరం వెలిగిపోతోంది. ఈ పవిత్ర అస్థికల రాకతో లడఖ్ ప్రాంతం ఆశీర్వదించబడిందని, భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎల్జీ సక్సేనా కోరారు.
