


రెండు రాష్ట్రాల ఎన్నికలకు సర్వం సిద్ధం
నేడు జరిగే తొలి దశ అసెంబ్లీ పోలింగ్‌తో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వాతావరణంలో రాజకీయ పోరు తారాస్థాయికి చేరింది. అవినీతి, ఉద్యోగాలు వంటి అంశాల కంటే గుర్తింపు, పౌరసత్వం, ఓటరు జాబితా నుంచి పేర్ల తొలగింపు వంటి విషయాలే ప్రచార కేంద్రమయ్యాయి. ఈ దశలో రాష్ట్రంలోని 294 స్థానాల్లో 152 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. ఉత్తర బెంగాల్ పరిధిలో ఎనిమిది జిల్లాల్లో 54 స్థానాలు, అలాగే ముర్షీదాబాద్, నదియా, బీర్భూమ్, హుగ్లీ జిల్లాల భాగాలు ఇందులో ఉన్నాయి. ఈ దశ ఫలితం ఉత్తర బెంగాల్‌లో ఏ పార్టీ పట్టు నిలుపుకుంటుందో నిర్ధారించేలా ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
3.60 కోట్లకు పైగా ఓటర్లు, అందులో సుమారు 1.75 కోట్లు మహిళలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కేంద్ర బలగాలు 2,450 కంపెనీలను నియమించగా, 8,000కు పైగా పోలింగ్ కేంద్రాలను అత్యంత సున్నితంగా గుర్తించారు. ఉత్తర బెంగాల్ ప్రాంతం గతంలో బీజేపీ ఎదుగుదలకు ముఖ ద్వారమైంది. అయితే ఈసారి అదే బలం కొనసాగిస్తుందా? లేక మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ తిరిగి పట్టు సాధిస్తుందా? అన్నది కీలకం.
ఎస్‌ఐఆర్ ప్రభావం
జిల్లాల మధ్య భౌగోళిక, సామాజిక తేడాలు ఉన్నా, ఒకే అంశం దాదాపు అన్ని చోట్ల ప్రభావం చూపుతోంది అదే ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్). సుమారు 91 లక్షల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించారని అంచనా. ముర్షీదాబాద్‌లో 7.48 లక్షలు, నదియాలో 4.85 లక్షలు, మాల్దాలో 4.59 లక్షలు, ఉత్తర్ దినాజ్‌పూర్‌లో3.63 లక్షలు, కూచ్‌బెహర్‌లో 2.42 లక్షల పేర్లను తొలగించారు.
ఎన్నికల ముందు కట్టుదిట్టమైన నిఘా
స్వేచ్ఛా, నిష్పాక్షిక ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కలిపి రూ. 1,072.13 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, విలువైన లోహాలు, ఇతర ప్రలోభ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇరురాష్ట్రాల్లో 5,011 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 5,363 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు పని చేస్తున్నాయి. ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించే విధానం అమల్లో ఉంది. పశ్చిమ బెంగాల్‌లో రూ.27.48 కోట్ల నగదు, 39,31,463 లీటర్ల మద్యం (రూ. 102.45 కోట్లు), రూ. 108.11 కోట్ల డ్రగ్స్,రూ. 55.88 కోట్ల విలువైన లోహాలు, ఫ్రీబీలు, ఇతర ప్రలోభాల మొత్తం రూ. 178.84 కోట్లుగా ఈసీఐ పేర్కోంది.
సిలిగురిలో పోలింగ్ సన్నాహాలు పరిశీలించిన విదేశీ బృందం
తొలి దశ పోలింగ్‌కు ముందు, సిలిగురిలో ఏడు దేశాలకు చెందిన 13 మంది విదేశీ ప్రతినిధులు పోలింగ్ సన్నాహాలను పరిశీలించారు. సిలిగురి కాలేజ్ మైదానంలోని డిస్ట్రిబ్యూషన్-కమ్-రిసెప్షన్ సెంటర్‌ను సందర్శించి, ఈవీఎంలు, వీవీప్యాట్ యూనిట్ల పంపిణీ, పోలింగ్ సిబ్బంది తరలింపును వీక్షించారు.
తమిళనాడులో
5.73 కోట్ల ఓటర్లు – 4,023 మంది అభ్యర్థుల భవితవ్యం
నేడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 5.73 కోట్లకు పైగా ఓటర్లు 4,023 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే ప్రలోభాల నివారణకు ఎన్నికల యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ కీలక పోరులో అధికార డీఎంకే నేతృత్వంలోని కూటమి, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే ఆధ్వర్యంలోని కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే.పళనిస్వామిఐదేళ్ల తర్వాత అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం ఓటర్లలో 2.93 కోట్లు మహిళలు, 2.83 కోట్లు పురుషులు, 7,728 మంది తృతీయ లింగ ఓటర్లు ఉన్నారు. తొలిసారి ఓటు వేయబోయే వారు 14,59,039 మంది. రాష్ట్రవ్యాప్తంగా 33,133 ప్రదేశాల్లో ఉన్న 75,064 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుంది. ఇందుకోసం 1,06,418 బ్యాలెట్ యూనిట్లు, 75,064 కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాలు వినియోగిస్తున్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా 20% ఈవీఎంలు, 30% వీవీప్యాట్‌లు రిజర్వ్‌లో ఉంచారు.
ప్రలోభాల నివారణలో భాగంగా రూ.1,262 కోట్ల విలువైన నగదు, వస్తువులను అడ్డుకున్నారు. అందులో రూ.543 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియా ఉల్లంఘనలపై 163 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి, 2,180 లింకులను బ్లాక్ చేశారు. తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు 243 స్పష్టీకరణలు జారీ చేశారు. సేవా ఓటర్లు 68,501 మంది ఉన్నారు. ఇప్పటివరకు 4,18,541 పోస్టల్ ఓట్లు అందాయి. 85 ఏళ్ల పైబడిన 3,98,513 మంది ఓటర్లకు ఇంటి వద్ద ఓటు వేసే సౌకర్యం కల్పించారు.
ప్రత్యేక ఏర్పాట్లలో భాగంగా 249 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 325 ‘పింక్’ కేంద్రాలు (మహిళల నిర్వహణలో), 71 దివ్యాంగుల నిర్వహణలో, 29 యువత నిర్వహణలో ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా కొన్ని జిల్లాల్లో గ్రీన్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మొబైల్ ఫోన్ల భద్రతకు
భద్రత కోసం 300 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, 83,875 మంది స్థానిక పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారు. 5,949 పోలింగ్ కేంద్రాలను అత్యంత సున్నితంగా గుర్తించారు. ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్లకు నిషేధం ఉన్నప్పటికీ, బయట భద్రపరిచే సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాన్ని గుర్తించేందుకు ‘వలికట్టి(దారిచూపే)’ యాప్ వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఈ ఎన్నికల్లో కొత్తగా టీవీకే వ్యవస్థాపకుడు విజయ్ పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసిన తర్వాత అన్ని ఈవీఎంలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 62 కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది.
