

రేపు హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం
హైదరాబాద్‌లో ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. జూన్ 8వ తేదీ సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. సోమవారం రాత్రి 9 గంటల నుంచి నిర్వాహకులు ఈ చేప ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
దాదాపు 179 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ విలక్షణ ప్రసాదం పంపిణీ కోసం, నేడు దూద్‌బౌలిలో సంప్రదాయబద్ధంగా బావి పూజ నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సందర్భంగా దేశ, విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది ఆస్తమా బాధితులకు ఈ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, నాన్-వెజ్ లేదా చేపతో ఇబ్బంది ఉన్న వారి కోసం ప్రత్యేకంగా బెల్లం ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుందని నిర్వాహక కమిటీ స్పష్టం చేసింది.
ఏర్పాట్లపై అధికారుల క్షేత్రస్థాయి సమీక్ష
లక్షలాది మంది తరలివచ్చే ఈ భారీ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో శరవేగంగా జరుగుతున్న ముందస్తు ఏర్పాట్లను హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు.
వారి వెంట రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. భక్తులకు కల్పించాల్సిన వసతులు, క్యూలైన్లు, తాగునీరు, రవాణా సౌకర్యాలపై వారు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
