
డ్రగ్స్ రహిత తెలంగాణకు అందరి భాగస్వామ్యం అవసరం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణం ప్రభుత్వ లక్ష్యమని, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్బంగా శుక్రవారం గచ్చిబౌలిలోని శిల్పకళా వేదికలో ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన "సే నో టు డ్రగ్స్" అవగాహన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో పాటు వందేమాతరం, రాష్ట్ర గీతాల ఆలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్, తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సమన్వయంతో డ్రగ్స్ సరఫరా, విక్రయం, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. చట్టపరమైన చర్యలతో పాటు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, డ్రగ్స్ మాఫియాపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
విద్యార్థులు తమ జీవిత లక్ష్యాలపై దృష్టి సారించి "సే నో టు డ్రగ్స్" సందేశాన్ని ఆచరణలో పెట్టాలని భట్టి పిలుపునిచ్చారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సామాజిక నాయకులు, సినీ ప్రముఖులు కీలక పాత్ర పోషించాలని కోరారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, డ్రగ్స్ నిర్మూలన ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సహకారం అవసరమని అన్నారు. గ్రామాల నుంచి నగరాల వరకు యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రత్యేక యంత్రాంగం పనిచేస్తోందని చెప్పారు. అనుమానాస్పద డ్రగ్స్ కార్యకలాపాల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా సినీ నటుడు రామ్ పోతినేని, నటి మీనాక్షి చౌదరి యువత చదువుపై దృష్టి పెట్టి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉంటామని విద్యార్థులు, అధికారులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీజీపీ సి.వి. ఆనంద్, ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్యతో పాటు పలువురు ఉన్నతాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
