
ప్రతి ఓటును కాపాడాలి.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి పిలుపు
తెలంగాణలో త్వరలో ప్రారంభంకానున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో అర్హులైన ఏ ఒక్కరు కూడా తమ ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ నియోజకవర్గాలకు తక్షణమే పార్టీ ఇన్‌చార్జీలను నియమించి ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్‌లో నిర్వహించిన 'రాజకీయ వ్యవహారాల కమిటీ' సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో పార్టీ శ్రేణులు, నాయకులు అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు.
ఈ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ముఖ్యంగా లంబాడీలు, ఆదివాసీలు, వలస కార్మికులు, దళితులు, మైనార్టీలు అదేవిధంగా మహిళల ఓట్లు పెద్ద సంఖ్యలో కోల్పోయే ప్రమాదం ఉందని అనేక నియోజకవర్గాల నుంచి ఉపాధి నిమిత్తం ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన నేపథ్యంలో వారి ఓటు హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత పార్టీపై స్పష్టం చేశారు. బూత్ స్థాయినుంచి కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించి నియోజకవర్గ ఇన్‌చార్జీలతో సమన్వయం చేసుకుంటూ ఒక్క అర్హుడి ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా కాపాడాలని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ వల్ల తలెత్తే సమస్యలపై నాయకులు పూర్తి అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.
మరోవైపు ప్రభుత్వంతో పాటు పార్టీని కూడా సమాంతరంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త కార్యాచరణను ప్రకటించారు. ఇకపై జిల్లా ఇన్‌చార్జీలుగా ఉన్న మంత్రులు ప్రతి పది రోజులకు ఒక పూర్తి రోజును అంటే నెలకు మొత్తం మూడు రోజులను కేవలం పార్టీ కార్యక్రమాలకే కేటాయించాలని ఆదేశించారు. ఆయా రోజుల్లో మంత్రులు నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి కార్యకర్తలను స్వయంగా కలిసి మాట్లాడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ పార్టీ కోసం శ్రమించాల్సిందేనని ఈ నిబంధన నుంచి ఎవరికీ మినహాయింపు లేదని తేల్చిచెప్పారు.
ఇదే క్రమంలో తాను కూడా ఇకపై ప్రతి పది రోజులకు ఒకసారి గ్రామస్థాయి కార్యకర్తలతో సమావేశమవుతానని నెలకు మూడు రోజులను పూర్తిగా పార్టీ శ్రేణుల కోసమే కేటాయిస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు. క్షేత్రస్థాయి కార్యకర్తలకు అండగా ఉంటూ వారిని నేరుగా కలుసుకోవడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కమిటీ సభ్యులు పాల్గొన్న ఈ పీఏసీ సమావేశంలో రాబోయే సవరణ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా ముందుకు సాగాలనే అంశంపై పూర్తి స్థాయి కార్యాచరణను ఖరారు చేశారు.
