
ప్రతిసారి బాధితులు దళితులే..ఘాజీపూర్ ఘటనపై రాహుల్‌గాంధీ
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో బాలికపై జరిగిన అత్యాచారం–హత్య ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని కూడా కోరారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో చేసిన పోస్టులో ఆయన మాట్లాడుతూ తమ కూతురికి జరిగిన అన్యాయానికి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించుకోవడానికే తల్లిదండ్రులు వేడుకోవాల్సిన పరిస్థితి ఉన్న దేశంలో, ఆ ప్రభుత్వానికి అధికారంలో ఉండే నైతిక హక్కు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఘాజీపూర్‌లో విశ్వకర్మ సమాజానికి చెందిన బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయని పేర్కొన్న ఆయన, కుటుంబ సభ్యులు కేసు నమోదు చేయడానికి ప్రయత్నించగా వారిని అడ్డుకునేందుకు బెదిరింపులు, హింసకు పాల్పడ్డారని ఆరోపించారు.
నేరస్తులకు రక్షణ
హాథ్రాస్, కథువా, ఉన్నావో… ఇప్పుడు ఘాజీపూర్ — ఇది ఒకే విధమైన ధోరణి. ప్రతి సారి బాధితులు దళిత, వెనుకబడిన, ఆదివాసీ లేదా పేద కుటుంబానికి చెందినవారే. నేరస్తులకు రక్షణ, బాధితులకు హింస.ఇదే పునరావృతమవుతోందని గాంధీ విమర్శించారు. నేరానికి బాధ్యులైన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి భద్రత కల్పించాలి. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి తక్షణమే న్యాయం అందించాలని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను ఉద్దేశిస్తూ మీ పాలనలో మహిళలు ఎందుకు సురక్షితంగా లేరు? అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం అడగడం కాదు… దాన్ని సాధించుకోవాలని అన్నారు.
బీజేపీ రాష్ట్రాల్లో బాధితులపైనే వేధింపులు
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా కూడా ఈ ఘటనపై స్పందించారు. ఘాజీపూర్‌లో కేసు నమోదు చేయడంలో ఆలస్యం, బాధిత కుటుంబానికి బెదిరింపులు, నాయకుల ఒత్తిడి ఇవన్నీ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు ఎంత పెరిగాయో చూపిస్తున్నాయని ఆమె విమర్శించారు. బీజేపీ పాలనలో మహిళలపై దాడులు జరిగితే బాధితురాలినే మరింత వేధించే పరిస్థితి ఏర్పడింది. ఉన్నావో, హాథ్రాస్, ప్రయాగ్‌రాజ్, ఘాజీపూర్ — ఎక్కడ చూసినా ఇదే దృశ్యం కనిపిస్తోందని ఆమె ఆరోపించారు. ఈ నెల 15న ఘాజీపూర్ జిల్లా కరండా ప్రాంతంలో ఒక టీనేజ్ బాలిక మృతదేహం లభ్యమైంది. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా, స్థానికులు, కుటుంబ సభ్యులు న్యాయం కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రీయ సరెండర్ సంఘ్‌గా ఆర్‌ఎస్‌ఎస్
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ దానిని ‘రాష్ట్రీయ సరెండర్ సంఘ్’గా అభివర్ణించారు. అమెరికాలో ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకుడు రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలు సంస్థ అసలు స్వభావాన్ని బయటపెట్టాయని ఆయన విమర్శించారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో రాహుల్ గాంధీ చేసిన పోస్టులో ‘నాగ్‌పూర్‌లో నకిలీ జాతీయత… అమెరికాలో పూర్తిగా వశీకరణ. రామ్ మాధవ్ వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్ అసలు ముఖాన్ని బయటపెట్టాయి’ అని పేర్కొన్నారు. అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌ను ‘ఫర్జీ నేషనలిజం’గా అభివర్ణించారు.
ఈ వివాదానికి కారణం, అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలే. హడ్సన్ ఇన్సిట్యూట్ నిర్వహించిన ‘న్యూ ఇండియా కాన్ఫరెన్స్’లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కర్ట్ క్యాంప్‌బెల్, ఎలిజిబెత్ థ్రెకెల్డ్‌తో కలిసి ఆయన చర్చించారు. ఈ చర్చలో రామ్ మాధవ్ మాట్లాడుతూ భారత్ ఇరాన్, రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేయడానికి అంగీకరించింది. అలాగే 50 శాతం టారిఫ్‌ను కూడా అభ్యంతరం లేకుండా అంగీకరించింది. అమెరికాతో సహకారం విషయంలో భారత్ ఇంకా ఏం చేయాలి? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో, రామ్ మాధవ్ తర్వాత వివరణ ఇచ్చారు.
