
బడిమానేసిన ప్రతి చిన్నారి మళ్లీ బడిబాట పట్టాలి :నారాయణపేట జిల్లా కలెక్టర్
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును గణనీయంగా పెంచడమే లక్ష్యంగా "ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట" కార్యక్రమాన్ని ప్రజా భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వేదికగా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో బడిబాట కార్యక్రమ అమలు, నమోదు లక్ష్యాలు, గ్రామస్థాయి ప్రచార కార్యక్రమాలు అదేవిదంగా పాఠశాలల సంసిద్ధతపై అధికారులతో కలిసి ఆమె విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ "బడిమానేసిన ప్రతి చిన్నారి మళ్లీ బడిబాట పట్టాలి" అన్నదే ఈ విద్యా సంవత్సరం ప్రధాన సంకల్పమని స్పష్టం చేశారు. జిల్లాలో వివిధ కారణాల వల్ల మధ్యలోనే బడిమానేసిన పిల్లలు, ఇప్పటివరకు ఏ పాఠశాలలోనూ పేరు నమోదు చేసుకోని విద్యార్థులు, బడి ఈడు గల బాలబాలికలను ప్రత్యేక సర్వేల ద్వారా గుర్తించాలని సూచించారు. గ్రామాలు, తండాలు, కాలనీల వారీగా విద్యాశాఖ సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరినీ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఏ ఒక్క చిన్నారి కూడా విద్యాహక్కుకు దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
గత మూడు సంవత్సరాల విద్యార్థుల నమోదు వివరాలను విశ్లేషించి ఈసారి అంతకంటే మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రతి పాఠశాల ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను భారీగా పెంచేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పరస్పర సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, యూనిఫార్ములు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, డిజిటల్ తరగతులు, ఇంగ్లీష్ మీడియం బోధన, మరియు 'ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ' వంటి వినూత్న కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.
బడిలో చేరిన వెంటనే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందజేసి ఆ వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న డిజిటల్ ల్యాబ్‌లు, లైబ్రరీలు, క్రీడా సదుపాయాలు మరియు కెరీర్ గైడెన్స్ వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా వారిలో నమ్మకాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. బడిబాట కార్యక్రమాన్ని ఒక సామాజిక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని, ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, స్వయం సహాయక సంఘాలు , ఆలుమ్ని కమిటీలు, ఆప్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యేలా హెచ్エムలు ప్రణాళికలు రూపొందించాలన్నారు. గ్రామ సభలు, విద్యార్థుల ర్యాలీలు, ఇంటింటి ప్రచారం ద్వారా ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలను ప్రజలకు వివరించాలని కోరారు.
ఈ ఏడాది బడిబాట కార్యక్రమాలను మే నెల నుంచి జూన్ వరకు దశలవారీగా నిర్వహించనున్నట్లు సమావేశంలో వెల్లడించారు. మే 14న తల్లిదండ్రులు, స్వయం సహాయక సంఘాలు, ఆప్ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశాలు, మే 21న అంగన్‌వాడీ టీచర్లు, తల్లుల కమిటీలతో ప్రత్యేక సమావేశాలు, మే 28న గ్రామీణ యువత, స్థానిక నాయకులతో విద్యా అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం జూన్ 3న గ్రామాల్లో "గ్రామసభలు", జూన్ 4 నుంచి 10 వరకు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వేలు, నూతన విద్యార్థుల నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు. చివరగా జూన్ 12 నుంచి 19 వరకు పాఠశాలల్లో స్వాగత వేడుకలు, ఫౌండేషన్ లిటరసీ, ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్, డిజిటల్ అవగాహన, క్రీడా దినోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత రెట్టింపు చేసేలా విద్యాశాఖ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ ప్రియాంక స్పష్టం చేశారు.
