Let's talk: editor@tmv.in
గడువుకంటే ముందే ‘నక్సలిజం’ నిర్మూలన: బీజేపీ నేత ఎన్వీ సుభాష్

గడువుకంటే ముందే ‘నక్సలిజం’ నిర్మూలన: బీజేపీ నేత ఎన్వీ సుభాష్

Gaddamidi Naveen
21 మే, 2026

నక్సల్స్ రహిత భారత్' సాకారమైందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎన్వీ సుభాష్ బుధవారం స్వాగతించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉగ్రవాద, నక్సల్ భావజాలాన్ని విజయవంతంగా తుడిచిపెట్టిందని, మాజీ తీవ్రవాదులను సైతం సమాజ ప్రధాన స్రవంతిలో కలిపిందని ఆయన కొనియాడారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో నక్సలిజం నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం మొదట 2026 మార్చి 31 ని కఠినమైన గడువుగా నిర్దేశించుకుందని గుర్తుచేశారు. అయితే, భద్రతా బలగాలు చేపట్టిన దూకుడు వ్యూహాలు, సమర్థవంతమైన ఆపరేషన్ల కారణంగా ఈ మైలురాయిని నిర్ణీత గడువు కంటే ముందే సాధించడం గర్వకారణమన్నారు. అడవుల్లోకి పారిపోయిన ఎందరో నక్సలైట్లు తమ ఆయుధాలను, మందుగుండు సామగ్రిని వదిలిపెట్టి ప్రభుత్వాల ముందు లొంగిపోయారని సుభాష్ తెలిపారు.

ఛత్తీస్‌గఢ్, తెలంగాణలలో మారిన పరిస్థితులు

నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి పొందిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని సుభాష్ పేర్కొన్నారు. అక్కడ లభించే అపారమైన సహజ వనరులను ఇప్పుడు రాష్ట్ర, దేశాభివృద్ధి కోసం స్వేచ్ఛగా ఉపయోగించుకునే అవకాశం లభించిందన్నారు. అదేవిధంగా, ఒకప్పుడు తీవ్ర హింసను చూసిన తెలంగాణలోని సరిహద్దు గ్రామాలు సైతం ఇప్పుడు నక్సల్ కార్యకలాపాలు క్షీణించడంతో ప్రశాంతంగా ప్రగతిని సాధిస్తున్నాయని, ఈ మార్పులే భవిష్యత్తులో 'వికసిత్ భారత్' నిర్మాణానికి మార్గం సుగమం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

2031 నాటికి వికసిత బస్తర్ లక్ష్యం

అంతకుముందు మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, దేశం నక్సల్స్ రహితంగా మారడమే కాకుండా.. 2031 నాటికి 'బస్తర్' ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే తమ తదుపరి ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. 2023 డిసెంబర్ 13న ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బస్తర్‌లో మిగిలిపోయిన నక్సలైట్ల నిర్మూలించడం వేగవంతం చేశామని, రాబోయే ఐదేళ్లలో బస్తర్ ప్రాంత ప్రజల ఆదాయాన్ని ఆరు రెట్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని షా వివరించారు.

భద్రతా క్యాంపులు ఇక ప్రజాసేవా కేంద్రాలుగా మార్పు

బస్తర్‌లోని ఏడు జిల్లాలను నక్సల్స్ పట్టు నుంచి విడిపించడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆ ప్రాంతంలో దాదాపు 200 భద్రతా క్యాంపులను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ ప్రాంతం ప్రశాంతంగా మారడంతో, మొదటి దశలో భాగంగా ఈ 200 క్యాంపులలో 70 క్యాంపులను "వీర్ షహీద్ గుండాతూర్ సేవా డేరాలు" గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సేవా డేరాల ముఖ్య ఉద్దేశం.. బస్తర్ లోని ప్రతి గిరిజన సోదర సోదరీమణుల ఇంటి వద్దకే నేరుగా ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాలను చేర్చడమేనని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చిన భద్రతా బలగాల శౌర్యాన్ని, త్యాగాలను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు.