Let's talk: editor@tmv.in
పర్యావరణ దినోత్సవం: విశాఖలో సీఎం చంద్రబాబు సైకిల్ సవారీ
పర్యావరణ దినోత్సవం: విశాఖలో సీఎం చంద్రబాబు సైకిల్ సవారీ

పర్యావరణ దినోత్సవం: విశాఖలో సీఎం చంద్రబాబు సైకిల్ సవారీ

Gaddamidi Naveen
6 జూన్, 2026

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విశాఖపట్నంలో సైకిల్ తొక్కి పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించారు. లేత ఆకుపచ్చ రంగు టోపీని ధరించిన ముఖ్యమంత్రి, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి తాను పాల్గొనబోయే సీ ఫుడ్ ఎగుమతుల వర్క్‌షాప్ జరిగే హోటల్ వరకు సైకిల్‌పై ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజలు కూడా సీఎం చంద్రబాబుతో కలిసి సైకిళ్లు తొక్కారు.

సైకిల్ ఎక్కడానికి ముందు చంద్రబాబు నాయుడు విలేకరులతో మాట్లాడుతూ.. ఈ రోజు పర్యావరణ దినోత్సవం, ప్రజల్లో అవగాహన పెంచేందుకే నేను సైకిల్‌పై ప్రయాణిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో సైక్లింగ్ అనేది ఒక జీవనశైలిగా మారాలని పిలుపునిచ్చారు. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణలో ఆంధ్ర యూనివర్సిటీ ఆదర్శంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. ఏయూను ‘నెట్ జీరో’ క్యాంపస్‌గా మార్చాలని అధికారులను ఆదేశించారు. ఒకవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే, మరోవైపు తుఫానులు విరుచుకుపడుతున్నాయని, ఇది పర్యావరణంలో వస్తున్న అసమతుల్యతకు నిదర్శనమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 450 ఎకరాల భూమి ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ.. ఖాళీ స్థలాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, వర్సిటీ విద్యుత్ అవసరాలన్నింటికీ సోలార్ (సౌర) శక్తిని వినియోగించుకోవాలని సూచించారు.

విశాఖపట్నంలో సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ‘సైక్లింగ్ ట్రాక్’ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ పోర్ట్ సిటీలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే విశాఖపట్నం పోర్ట్ ద్వారా ఇతర సంస్థల వల్ల కలిగే కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడానికి కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) గ్రౌండ్స్ నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్రలో సీఎం సుమారు 5.5 కిలోమీటర్ల దూరాన్ని ఆయన కేవలం 21 నిమిషాల 18 సెకన్లలో పూర్తి చేశారు.