
రామచంద్రపురం యువతకు ఉపాధి అవకాశం.. 150 ఖాళీల భర్తీకి వాక్-ఇన్
డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఒక గొప్ప అవకాశాన్ని ముందుకు తెచ్చింది. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ టెలికాం రంగ సంస్థలైన ఎయిర్‌టెల్, అడెక్కో సంయుక్తంగా భారీ వాక్-ఇన్ జాబ్ డ్రైవ్‌ను నిర్వహించనున్నాయి. ఈ ఉద్యోగ మేళా ఈ నెల 28వ తేదీ గురువారం నాడు రామచంద్రపురంలోని కె.వి.ఆర్. హాస్పిటల్ సమీపంలో ఉన్న ఉపాధి కార్యాలయంలో (ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్) జరగనుంది.
ఈ జాబ్ మేళా ద్వారా టెలికాం రంగంలో ఇంజనీర్లు, వైర్‌మెన్ విభాగాల్లో మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక విద్యార్హతల విషయానికి వస్తే.. బీటెక్ పూర్తి చేసిన వారు ఇంజనీర్ పోస్టులకు అదేవిదంగా కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైన స్థానిక యువతీ యువకులు వైర్‌మెన్ పోస్టులకు అర్హులుగా పేర్కొన్నారు. స్థానిక నిరుద్యోగులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఫౌండేషన్ ప్రతినిధులు కోరారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 28న జరిగే ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమతో పాటు అప్‌డేటెడ్ రెజ్యూమే (బయోడేటా), విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ మరియు జిరాక్స్ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు) వెంట తీసుకురావాలని సూచించారు.
ఈ జాబ్ మేళాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి లేదా ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి అభ్యర్థులు 7075704852 , 7075904852 మొబైల్ నంబర్లను సంప్రదించవచ్చని నిర్వాహక కమిటీ స్పష్టం చేసింది.
