

జాబ్ మేళాతో మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు: మంత్రి అజారుద్దీన్
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మైనారిటీ సంక్షేమ శాఖ, తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీఎంఎఫ్‌సీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మహ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ, జాబ్ మేళా విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్‌తో పాటు అన్ని భాగస్వామ్య సంస్థలకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమం, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో విశేష పురోగతి సాధించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు లక్ష ఉద్యోగ అవకాశాల సృష్టి దిశగా చర్యలు తీసుకుంటోందని, మైనారిటీ సంక్షేమ శాఖ టీజీఎంఎఫ్‌సీ సమన్వయంతో మైనారిటీ యువతను ఉపాధి అవకాశాలతో అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు తదితర అన్ని మైనారిటీ వర్గాలకు ఎలాంటి వివక్ష లేకుండా అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
జాబ్ మేళా ఉద్దేశం కేవలం నియామక పత్రాలు పంపిణీ చేయడం మాత్రమే కాదని, ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరే వరకు ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తుందని మంత్రి తెలిపారు. యువతకు స్థిరమైన ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో నిజామాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించి మరింత మంది మైనారిటీ యువతకు అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. యువత విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని, టీజీఎంఎఫ్‌సీ ద్వారా నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని మంత్రి సూచించారు. కష్టపడి పనిచేయడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా యువత తమ భవిష్యత్తును విజయవంతంగా తీర్చిదిద్దుకోవచ్చన్నారు.
ఈ మెగా జాబ్ మేళాలో 50 నుంచి 60 ప్రముఖ కంపెనీలు పాల్గొని లాజిస్టిక్స్, ఈ-కామర్స్, రిటైల్, హాస్పిటాలిటీ, తయారీ, ఆటోమొబైల్, నిర్మాణం, ఐటీఈఎస్, బీపీఓ, ఐటీ, ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌కేర్, మేనేజ్‌మెంట్ తదితర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అందించాయి. అలాగే 20 శిక్షణా సంస్థలు పాల్గొని కెరీర్ కౌన్సెలింగ్, నైపుణ్యాభివృద్ధి కోర్సుల నమోదు సేవలను అందించాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2,000 మంది మైనారిటీ యువత ఈ జాబ్ మేళాకు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి. షఫియుల్లా తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
