Let's talk: editor@tmv.in
అనిశ్చితిలో ఉపాధి: వృద్ధి చెందుతున్న భారత్ ముందన్న సవాళ్లు!

అనిశ్చితిలో ఉపాధి: వృద్ధి చెందుతున్న భారత్ ముందన్న సవాళ్లు!

Sumit Sharma
25 ఏప్రిల్, 2026

ఇటీవల నోయిడాలో జరిగిన కార్మిక నిరసనలు కేవలం ఒక పారిశ్రామిక వివాదంగా మాత్రమే కాకుండా, భారత ఆర్థిక వ్యవస్థలోని లోతైన అసమానతలకు ప్రతిబింబంగా నిలిచాయి. కనీస వేతనాల సవరణ జరిగినప్పటికీ, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు లేవన్న కార్మికుల ఆవేదన ఉపాధి నాణ్యతపై పెద్ద ప్రశ్నను లేవనెత్తింది. ఉత్పత్తి తిరిగి ప్రారంభమై శాంతి నెలకొన్నప్పటికీ, "భారతదేశంలో నేడు ఉపాధి అంటే ఏమిటి?" అనే ప్రశ్న సజీవంగా ఉంది. ఈ నిరసనలు కేవలం వేతనాల గురించి మాత్రమే కాదు, ఒక సామాన్య కార్మికుడి జీవన భద్రత, పెరుగుతున్న ఖర్చులు, భవిష్యత్తుపై ఉన్న భయం మధ్య జరుగుతున్న పోరాటాన్ని సూచిస్తున్నాయి. దేశం వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ, ఆ వృద్ధి ఫలాలు క్షేత్రస్థాయిలోని శ్రామిక వర్గానికి పూర్తిస్థాయిలో అందడం లేదని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.

వేతనాలు.. ద్రవ్యోల్బణం

నిరసనలకు ప్రధాన కారణం ఆదాయానికి, వ్యయానికి మధ్య పెరుగుతున్న అంతరం. ఆహారం, గృహ వసతి, రవాణా, ఆరోగ్యం, విద్య వంటి కనీస అవసరాల ఖర్చులు ఆకాశాన్ని అంటుతుంటే, వేతనాలు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2024–25 గణాంకాల ప్రకారం, స్వయం ఉపాధి పొందుతున్న వారి సగటు వార్షిక ఆదాయం కేవలం 5నుంచి 6శాతం మాత్రమే పెరిగింది. ఇది దేశంలోని ద్రవ్యోల్బణ రేటుతో పోలిస్తే చాలా తక్కువ. అంటే, కాగితం మీద వేతనాలు పెరిగినట్లు కనిపిస్తున్నా, కార్మికుడి కొనుగోలు శక్తి మాత్రం క్షీణిస్తోంది. కనీస వేతనాల సవరణలు కూడా ప్రస్తుత జీవన ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం వల్ల, శ్రామిక వర్గం ఆర్థికంగా ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మిగిలిపోతోంది.

ఉద్యోగ భద్రత లేక ఐటీ రంగంలో ఆందోళనలు

కేవలం అసంఘటిత రంగమే కాకుండా, పారిశ్రామిక, సేవా రంగాలు కూడా నేడు అనిశ్చితిలో ఉన్నాయి. ఒకప్పుడు అత్యంత సురక్షితమని భావించిన ఐటీ, టెక్ రంగాలలో కూడా ఇప్పుడు లే-ఆఫ్స్ (ఉద్యోగాల కోత) సర్వసాధారణం అయ్యాయి. గూగుల్, అమెజాన్, మెటా వంటి ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థల ప్రభావం భారతీయ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రోలపై కూడా పడింది. ఈ కంపెనీలు నియామకాలను తగ్గించడమే కాకుండా, పనితీరు ప్రమాణాలను కఠినతరం చేశాయి. ఇది కేవలం తక్కువ వేతనాల సమస్య మాత్రమే కాదు, "రేపు నా ఉద్యోగం ఉంటుందా?" అనే ప్రాథమిక భద్రతకు సంబంధించిన ఆందోళన. ఇలాంటి పరిస్థితులు మధ్యతరగతి, ఉన్నత నైపుణ్యం కలిగిన వర్గాల్లో కూడా మానసిక ఒత్తిడిని, ఆర్థిక అస్థిరతను పెంచుతున్నాయి.

నిరుద్యోగ గణాంకాలు, క్షేత్రస్థాయి వాస్తవాలు

భారతదేశ ఉపాధి రంగంలో గణాంకాల వైరుధ్యం ఒక పెద్ద చిక్కుముడి. ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం నిరుద్యోగిత రేటు 3.1 నుంచి 3.2శాతం వద్ద స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, సీఎంఐఈ వంటి స్వతంత్ర సంస్థల అంచనాలు ఇది 7నుంచి 8శాతం వరకు ఉండవచ్చని చెబుతున్నాయి. ఈ గణాంకాల్లోని వ్యత్యాసానికి కారణం 'అల్ప ఉపాధి'. అంటే, ఒక వ్యక్తి పని చేస్తున్నట్లు కనిపిస్తున్నా, అది అతని సామర్థ్యానికి లేదా అవసరాలకు సరిపడా ఆదాయాన్ని ఇవ్వడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడిన 45శాతం జనాభా దేశ జీడీపీలో కేవలం 20శాతం కంటే తక్కువ వాటాను కలిగి ఉండటం గమనార్హం. ఇది 'ప్రచ్చన్న నిరుద్యోగాన్ని' సూచిస్తుంది, దీనివల్ల గ్రామాల నుండి నగరాలకు వలసలు పెరిగి, పట్టణ ప్రాంతాల్లో అసంఘటిత రంగంపై ఒత్తిడి పెరుగుతోంది.

గిగ్ ఎకానమీ విస్తరణ

భారతదేశ శ్రామిక శక్తిలో 80నుంచి85శాతం మంది అసంఘటిత రంగంలోనే ఉన్నారు. వీరికి సామాజిక భద్రత, పింఛను, లేదా ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు లేవు. ఇటీవలి కాలంలో 'గిగ్ ఎకానమీ' (డెలివరీ బాయ్స్, ఫ్రీలాన్సర్స్ మొదలైనవి) వేగంగా విస్తరిస్తోంది. నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం 2030 నాటికి దేశంలో 2.3 కోట్ల మంది గిగ్ వర్కర్లు ఉంటారు. ఈ నమూనా కొంతమందికి తక్షణ ఉపాధిని కల్పించినప్పటికీ, ఇందులో దీర్ఘకాలిక భద్రత కరువైంది. ఒప్పంద ప్రాతిపదికన పని చేయడం వల్ల యాజమాన్యాలకు బాధ్యత తగ్గుతుంది కానీ, కార్మికులకు అభద్రతా భావం పెరుగుతుంది. ఎంఎస్ఎంఈ రంగం కోట్లాది ఉద్యోగాలను సృష్టిస్తున్నప్పటికీ, పెరిగిన ముడిసరుకు ఖర్చుల వల్ల వారు కార్మికులకు ఆకర్షణీయమైన వేతనాలు ఇవ్వలేకపోతున్నారు.

నైపుణ్యాల కొరత

చారిత్రక సాక్ష్యాల ప్రకారం, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే తయారీ రంగం కీలకం. కానీ భారత్‌లో ఈ రంగం కేవలం 12 నుంచి 14శాతం ఉపాధిని మాత్రమే కల్పిస్తోంది. సేవా రంగం జీడీపీలో 50శాతం పైగా వాటాను కలిగి ఉన్నప్పటికీ, అది అందరికీ సమానమైన ఉపాధిని ఇవ్వలేకపోతోంది. మరోవైపు, ఏటా దాదాపు కోటి మంది యువత శ్రామిక శక్తిలో చేరుతున్నారు. కానీ మన విద్యావ్యవస్థ అందించే నైపుణ్యాలకు, పరిశ్రమలకు కావాల్సిన అవసరాలకు మధ్య పెద్ద 'నైపుణ్య అంతరం' ఉంది. దీనివల్ల డిగ్రీలు ఉన్నా ఉద్యోగాలు దొరకని పరిస్థితి లేదా నైపుణ్యం లేని కారణంగా తక్కువ జీతాలకు పని చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం ఎన్ని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా, క్షేత్రస్థాయిలో వాటి ప్రభావం ఇంకా ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు.

బహుముఖ వ్యూహం

ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రభుత్వం, పరిశ్రమలు సమన్వయంతో పనిచేయాలి. మొదటిగా, శ్రమశక్తి ఎక్కువగా అవసరమయ్యే తయారీ రంగాలను ప్రోత్సహించాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సులభమైన రుణాలు, సరళమైన నిబంధనలు అందించడం ద్వారా అవి మరింత మందికి నాణ్యమైన ఉపాధిని ఇచ్చేలా చూడాలి. రెండవది, గిగ్ వర్కర్లకు, అసంఘటిత రంగ కార్మికులకు కనీస సామాజిక భద్రతను కల్పించే చట్టాలు బలోపేతం కావాలి. మూడవది, విద్యా రంగంలో సంస్కరణలు తీసుకువచ్చి, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యువతను సిద్ధం చేయాలి. వేతన విధానాలు కేవలం 'కనీస జీవనం' కోసం కాకుండా, గౌరవప్రదమైన జీవన ప్రమాణాలను ప్రతిబింబించేలా ఉండాలి.

నోయిడా ఘటన ఒక హెచ్చరిక మాత్రమే. ఆర్థిక వృద్ధి అంటే కేవలం గణాంకాలు, జీడీపీ నంబర్లు పెరగడం కాదు. ఆ వృద్ధి సామాన్యుడి కళ్లలో భరోసాను నింపాలి. పని చేసే ప్రతి చేతికీ తగిన ప్రతిఫలం, ప్రతి ప్రాణానికీ తగిన భద్రత ఉన్నప్పుడే ఆ వృద్ధికి అర్థం ఉంటుంది. ఉద్యోగం అంటే కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదు, అది ఒక వ్యక్తి ఆత్మగౌరవానికి, సామాజిక స్థిరత్వానికి చిహ్నం. నేటి అనిశ్చితి కాలంలో, ఉపాధిని ఒక సంక్షోభంగా కాకుండా, ఒక బాధ్యతగా గుర్తించి చర్యలు చేపట్టినప్పుడే భారతదేశం 'వికసిత భారత్' దిశగా నిజమైన అడుగులు వేయగలదు. లేనిపక్షంలో, అభద్రతా భావంతో ఉన్న శ్రామిక శక్తి దేశాభివృద్ధికి చోదక శక్తిగా కాకుండా, సామాజిక అసమతుల్యతకు కారణమయ్యే ప్రమాదం ఉంది.