
ఉద్యోగుల జీతాల బకాయిలు ఇవ్వాలి, కొత్త పీఆర్‌సీ ప్రకటించాలి:కాంగ్రెస్ నేత చింతా మోహన్
ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన జీతాల బకాయిలను వెంటనే చెల్లించాలని, కొత్త వేతన సవరణ (12వ పీఆర్‌సీ)ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం గుంటూరు కలెక్టరేట్ దగ్గర కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది.
ఈ ధర్నాలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతా మోహన్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, వారికి రావాల్సిన సుమారు రూ. 30 వేల కోట్ల జీతాల బకాయిలు (అరియర్స్) ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని ఆయన చెప్పారు. దీనివల్ల ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
అదేవిధంగా అమరావతి రాజధాని భూముల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. రాజధాని ప్రాంతంలో పేద దళితుల భూములను లాక్కొని, వాటిని ధనికులకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. "అమరావతి కాస్తా ఇప్పుడు 'చంద్రావతి గా మారిపోయింది" అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై విమర్శలు గుప్పించారు. గతంలో పాలించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయినా ఇప్పుడున్న చంద్రబాబు అయినా రాష్ట్రానికి అవినీతి లేని పాలన ఇవ్వలేరని. కేవలం కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
పెరుగుతున్న ధరలపై ఆగ్రహం
మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచుతున్న కేంద్ర ప్రభుత్వ తీరును కూడా చింతా మోహన్ తప్పుబట్టారు. గతంలో కాంగ్రెస్ ప్రధానమంత్రులు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నా సామాన్యుడిపై భారం పడకుండా పెట్రోల్ ధరలను అదుపులో ఉంచారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం నిరంతరం ధరలు పెంచుతూ సామాన్య ప్రజల నడుం విరుస్తోందని మండిపడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగులకు, సామాన్యులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం ఆపబోమని ఈ నిరసనలను మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.
