


రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగింపు
పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన హైటెన్షన్ ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్ర రాజకీయ మాటల యుద్ధం సాగింది. ఏప్రిల్ 23న ఉత్తర బెంగాల్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఈ దశలో సుమారు 3.60 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1.84 కోట్లు పురుషులు, 1.75 కోట్లు మహిళలు, 465 మంది తృతీయ లింగ ఓటర్లు ఉన్నారు. భద్రత కోసం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 2,450 కేంద్ర పారామిలటరీ బలగాల కంపెనీలు, సుమారు 2.5 లక్షల సిబ్బంది మోహరించారు. 8,000కు పైగా పోలింగ్ కేంద్రాలను అత్యంత సున్నితంగా గుర్తించారు. మాల్డా, ముర్షీదాబాద్, కూచ్ బేహార్, బీర్భూమ్, బర్ద్వాన్ వంటి జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ఈ ఎన్నికల్లో టీఎంసీ నాలుగోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకోగా, బీజేపీ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రయత్నిస్తోంది. ముఖ్య అభ్యర్థుల్లో సువేందు అధికారి (నందిగ్రామ్), నిసిత్ ప్రమాణిక్, ఉదయన్ గుహ, గౌతమ్‌దేబ్, అధీర్ రంజన్ చౌదరి వంటి నేతలు ఉన్నారు.
ప్రచారంలో మాటల యుద్ధం
ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో హింస, అవినీతి పెరిగిందని, చొరబాట్లకు టీఎంసీ సహకరిస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉండగా, టీఎంసీ బీజేపీపై విమర్శలు చేస్తూ, ఓటర్ల జాబితాలో మార్పులు చేసి రాజకీయ లాభం పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. బీజేపీ గెలిస్తే చేపలు, మాంసం, గుడ్ల వినియోగాన్ని నిషేధిస్తుందని కూడా టీఎంసీ ఆరోపించగా, బీజేపీ దీనిని ఖండించింది. ఈ ఎన్నికల్లో గోర్ఖాలాండ్ డిమాండ్, టీ తోటల కార్మికుల వేతనాలు, వ్యవసాయ సమస్యలు వంటి అంశాలు ప్రధాన చర్చగా నిలిచాయి. ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్) ప్రక్రియపై రాజకీయ వివాదం చెలరేగింది. ముర్షీదాబాద్‌లో 7.4 లక్షలకు పైగా పేర్లు తొలగించడంపై టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఎన్నికల సంఘం ఇది సాధారణ ప్రక్రియలో భాగమని తెలిపింది.
తమిళనాడులోనూ..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం నెల రోజులుగా సాగిన ఉత్కంఠభరిత ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. పోలింగ్‌కు 48 గంటల ముందు అమల్లోకి వచ్చే ‘సైలెంట్ పీరియడ్’ ప్రారంభమైంది. ఈ కాలంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సభలు, ర్యాలీలు నిర్వహించడం, ప్రచార ప్రకటనలు ఇవ్వడం నిషేధం అని అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కొనసాగుతుంది.
ఏప్రిల్ 23న పోలింగ్ జరగగా, మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని సున్నిత ప్రాంతాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.
ఆశీర్వదించండి.. అభ్యర్థుల వేడుకోలు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ తన కొలత్తూర్ నియోజకవర్గంలో ఓటర్లతో సమావేశమై ప్రచారాన్ని ముగించారు. అనంతరం సోషల్ మీడియాలో వీడియో విడుదల చేస్తూ, తమిళనాడు అభివృద్ధిని అడ్డుకునే వారిపై తాను ‘ప్రమాదకరంగా’ ఉంటానని పేర్కొన్నారు. అలాగే డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా కేంద్రం తమిళనాడును శిక్షించాలనుకుంటోందని విమర్శించారు. తూత్తుకుడిలో డీఎంకే నేత, ఎంపీ కనిమొళి పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే.పళనిస్వామి పశ్చిమ తమిళనాడులో తన ప్రచారాన్ని ముగిస్తూ అవినీతి డీఎంకే ప్రభుత్వాన్ని తొలగించాలని ప్రజలను కోరారు. కుటుంబ పాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.
ప్రచారంలో భాగంగా ప్రధాని , కేంద్ర హోంమంత్రి , ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. ఈసారి ఎన్నికల్లో అభివృద్ధి, కుటుంబ పాలన, అవినీతి ఆరోపణలు ప్రధాన అంశాలుగా నిలిచాయి. అయితే డీలిమిటేషన్ అంశం ప్రచారంలో కీలకంగా మారింది.
పోటీ ఆసక్తికరం
డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్, ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే కూటముల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. డీఎంకే 164 స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని మిత్రపక్షాలు 70 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఏఐఏడీఎంకే 169 స్థానాల్లో, దాని మిత్రపక్షాలు 65 స్థానాల్లో బరిలో ఉన్నాయి. ఇక నటుడు విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కజగం 234 స్థానాల్లో పోటీ చేయడం ఈ ఎన్నికలకు మరింత ఆసక్తిని తెచ్చింది. ఆయనతో పాటు నటుడు కమల్‌హసన్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. మాజీ దర్శకుడు సీమన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. దీంతో ఈ ఎన్నికలు నాలుగు ప్రధాన శక్తుల మధ్య పోటీగా మారాయి. మొత్తం 4,023 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, 5.73 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
