
బెంగాల్‌లో ముగిసిన ఎన్నికల ప్రచారం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో, తుది దశ ప్రచారం సోమవారం హైడ్రామా మధ్య ముగిసింది. ఎస్‌ఐఆర్, చొరబాట్లు (ఇన్‌ఫిల్ట్రేషన్), అవినీతి, నిరుద్యోగం వంటి అంశాలపై బీజేపీ–టీఎంసీ మధ్య తీవ్ర మాటల యుద్ధం సాగింది. మొత్తం 142 నియోజకవర్గాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు రెండు పార్టీలు పలు హామీలు గుప్పించాయి. ప్రచారం సందర్భంగా బీజేపీ, రాష్ట్రాన్ని చొరబాటుదారుల కేంద్రంగా మార్చారని టీఎంసీపై ఆరోపించగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ, బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని, రాష్ట్రాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించింది.
భారీ భద్రతా ఏర్పాట్లు
ఈ దశలో మొత్తం 3,21,73,837 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 1,64,35,627 మంది పురుషులు, 1,57,37,418 మంది మహిళలు, 792 మంది తృతీయ లింగ ఓటర్లు ఉన్నారు. ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుండగా, 41,001 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుంది. అన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కమిషన్ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఏడు జిల్లాల్లో 2,321 కేంద్ర బలగాల కంపెనీలు మోహరించారు. అదనంగా 142 సాధారణ పరిశీలకులు, 95 పోలీస్ పరిశీలకులు, 100 వ్యయ పరిశీలకులను నియమించారు. డ్రోన్ల ద్వారా కూడా పర్యవేక్షణ జరుగుతోంది. కోల్‌కత్తాలోనే అత్యధికంగా 273 కంపెనీలు మోహరించారు.
ఈ దశలో కీలక పోటీలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి మళ్లీ పోటీ చేస్తుండగా, ఆమెకు బీజేపీ నేత సువేందు అధికారి నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది. కోల్‌కత్తా పోర్ట్ నియోజకవర్గంలో టీఎంసీ నేత ఫిర్హాద్ హకీమ్, బీజేపీ అభ్యర్థి రాకేష్ సింగ్ మధ్య పోటీ కీలకంగా మారింది. ఇతర ముఖ్య నియోజకవర్గాల్లో భట్‌పారా, జగద్దల్, బరాక్‌పూర్, బంగాన్, డమ్‌డమ్, సందేశ్‌ఖాలి, హింగల్‌గంజ్, రానాఘాట్ ఉత్తర–దక్షిణ, రష్‌బెహారి, జాదవ్‌పూర్, బాలీగంజ్ ఉన్నాయి.
టీఎంసీపై బీజేపీ మూకుమ్మడి మాటల దాడి
బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ప్రచారం చేశారు. ప్రభుత్వ వ్యవస్థ క్షీణత, మహిళలపై నేరాలు, రాజకీయ హింస, అవినీతి వంటి అంశాలపై టీఎంసీపై తీవ్ర విమర్శలు చేశారు. మోడీ, మటువా సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై టీఎంసీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ, శరణార్థులకు శాశ్వత నివాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అమిత్ షా మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేస్తామని గూండా రాజ్, సిండికేట్ రాజ్‌కు ముగింపు పలుకుతామని చెప్పారు. మహిళలకు నెలకు రూ.3,000 భృతి, నిరుద్యోగ యువతకు సాయం, మహిళలకు ఉచిత ప్రయాణం వంటి హామీలు ఇచ్చారు.
ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు ఏమయ్యాయి?
దీనికి ప్రతిగా టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, బీజేపీ గత హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలన్న వాగ్దానాలు నెరవేర్చలేదని పేర్కొన్నారు. మమతా బెనర్జీ, మొదటి దశలోనే తమ పార్టీ 100 సీట్లకు పైగా గెలిచిందని, మొత్తం ఎన్నికల్లో రెండొంతుల మెజారిటీ సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. చివరి రోజు భవానీ పూర్‌లో పాదయాత్ర నిర్వహిస్తూ ఓట్లను అభ్యర్థించారు.
ఏప్రిల్ 23న జరిగిన మొదటి దశలో 93.19 శాతం పోలింగ్ నమోదైంది. అమిత్ షా చేసిన ‘తలకిందులుగా వేలాడదీస్తాం’ అనే వ్యాఖ్యలపై మమతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్ల జాబితా తొలగింపులపై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ కూడా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి 25 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మొత్తం మీద, బెంగాల్ ఎన్నికల రెండో దశకు ముందు రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.
