Let's talk: editor@tmv.in
రేవంత్ రెడ్డి రూపంలో తెలంగాణకు ‘ఎల్‌నినో’ పట్టుకుంది: మాజీ మంత్రి హరీష్ రావు

రేవంత్ రెడ్డి రూపంలో తెలంగాణకు ‘ఎల్‌నినో’ పట్టుకుంది: మాజీ మంత్రి హరీష్ రావు

Gaddamidi Naveen
2 జులై, 2026

కరీంనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఈ సంద‌ర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీకి, కరీంనగర్ నేలకు విడదీయరాని పేగుబంధం ఉందని గుర్తుచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి, కేసీఆర్ ఆమరణ దీక్షకు, అలుగునూర్ చౌరస్తా అరెస్టుకు ఈ గడ్డే వేదికైందన్నారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడికి రైల్వే లైన్, తాగునీటి పథకాలు తెచ్చారని.. సీఎం అయ్యాక మిషన్ భగీరథతో నీళ్లు ఇచ్చి, రైల్వే పనులను పరుగులు పెట్టించారని తెలిపారు. రెండుసార్లు ఎంపీ పదవికి రాజీనామా చేసినప్పటికీ కేసీఆర్‌ను ప్రజలు గెలిపించి ఆదరించిన చరిత్ర కరీంనగర్‌దేనని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, సీఎం రేవంత్ రెడ్డి మాటల్లోనే ఓటమి భయం కనిపిస్తోందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. అధికారం శాశ్వతం కాదు అని సీఎం అనడమే ఆయన జారుడుబండ మీద ఉన్నాడనడానికి నిరూపణ అన్నారు.

రైతులకు మూడు విడతల రైతుబంధు ఎగ్గొట్టి, యాసంగి బోనస్ బోగస్ చేసి, కరెంట్ కోతలతో గోస పెడుతూ.. ఏ మొహం పెట్టుకుని తనను కంచె వేసి కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు? వేములవాడ రాజన్న మీద ఒట్టుపెట్టి రుణమాఫీ చేయకుండా దేవుడిని, రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డిని ప్రజలు క్షమించరని అన్నారు. 2023 డిసెంబర్‌లో రేవంత్ రూపంలో రాష్ట్రానికి ఒక పెద్ద 'ఎల్‌నినో' (కరువు) పట్టుకుందన్నారు. కాగడాలు పట్టుకుని ఈ ఎల్‌నినోను తరిమికొట్టాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

కరువు వస్తుందని ముందే ఊహించి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, గత రెండేళ్లు ఎల్లంపల్లి, మిడ్ మానేరుల ద్వారా పంటలు బ్రహ్మాండంగా పండాయని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతో ప్రభుత్వం బురద రాజకీయం చేస్తూ నీళ్లను వృథా చేస్తోందని ఆరోపించారు. మేడిగడ్డ వద్ద 20 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నా కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయడం లేదని.. వెంటనే మోటార్లు ఆన్ చేసి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీలకు నీళ్లు తరలించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. దెబ్బతిన్న రెండు గేట్లకు మరమ్మతులు చేసి ఉంటే, ఇవాళ తెలంగాణ ఈ ఎల్‌నినోను సమర్థవంతంగా ఎదుర్కొని ఉండేదన్నారు.

స‌ర్ ప్రక్రియపై కూడా హరీష్ రావు కార్యకర్తలకు సూచనలు చేశారు. ప్రతి అర్హుడైన ఓటరు నమోదు పూర్తయ్యేలా బూత్ స్థాయిలో పనిచేయాలని, జూలై 25లోపు ఫారాల సేకరణను పూర్తి చేయాలని కోరారు. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలు లేదా విదేశాల్లో ఉన్న ఓటర్ల వివరాలను కూడా సమన్వయం చేసి నమోదు చేయించాలని సూచించారు. అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే యువత కూడా ఇప్పుడే ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. బూత్ ఏజెంట్లే పార్టీకి కళ్లు, చెవులని, వారి సమర్థవంతమైన పని పార్టీ విజయానికి పునాది అవుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు
HarishRaoBRSKCRKarimnagarTelanganaTelanganaPoliticsRevanthReddyCongressKaleshwaramFarmersVoterRegistrationBRSWorkersPoliticalNews
రేవంత్ రెడ్డి రూపంలో తెలంగాణకు ‘ఎల్‌నినో’ పట్టుకుంది: మాజీ మంత్రి హరీష్ రావు - Tholi Paluku