Let's talk: editor@tmv.in
నేలమట్టమైన ‘ఏకతా భవన్’...చారిత్రక చిహ్నం కనుమరుగు

నేలమట్టమైన ‘ఏకతా భవన్’...చారిత్రక చిహ్నం కనుమరుగు

Panthagani Anusha
15 ఏప్రిల్, 2026

బీహార్ రాజధాని పాట్నా నగర ఆకాశహర్మ్యాల వరుసలో నాలుగు దశాబ్దాలుగా ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన ‘ఇందిరా గాంధీ ఏకతా భవన్’ చరిత్రలో కలిసిపోయింది. ఆధునిక శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ భవనాన్ని ప్రభుత్వం ఇటీవల కూల్చివేసింది. ఈ స్థలంలో సుమారు రూ.48 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మక ‘పాట్నా హాట్’ నిర్మాణానికి అధికారులు మార్గం సుగమం చేశారు. అయితే అభివృద్ధి పేరుతో ఆధునిక వారసత్వ కట్టడాలను కాలగర్భంలో కలిపేయడంపై నగరవాసులు, వాస్తుశిల్పుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

నగరానికే ప్రత్యేక ఆకర్షణ

గాంధీ మైదాన్ సమీపంలో గంగా నది తీరానికి అభిముఖంగా ఉన్న ఈ భవనం తన వినూత్న కాంక్రీట్ నిర్మాణ శైలితో అందరినీ ఆకట్టుకునేది. దీని జ్యామితీయ ఆకృతులు, విలక్షణమైన రూపురేఖల కారణంగా స్థానికులు దీనిని “శాటిలైట్ భవనం” అని పిలుచుకునేవారు. 1986 సెప్టెంబర్ 9న అప్పటి ఉపరాష్ట్రపతి ఆర్. వెంకటరామన్ ఈ భవనానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తయినప్పటికీ లోపలి పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో ఇది ఎన్నడూ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదు. అశోక్ రాజ్‌పథ్ మార్గంలో వెళ్లేవారికి ఇది దశాబ్దాలుగా ఒక అద్భుత శిల్పంలా దర్శనమిచ్చేది.

ముందుకు ‘పాట్నా హాట్’ ప్రాజెక్టు

కూల్చివేసిన ఏకతా భవన్ స్థలంలో మగధ ప్రాంత కళలు, సంస్కృతి, హస్తకళల వైభవాన్ని చాటిచెప్పేలా ‘పాట్నా హాట్’ను నిర్మించాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలోని మధుబనీలో ‘మిథిలా హాట్’ విజయవంతం కాగా, రోహ్తాస్ జిల్లాలో ‘భోజ్‌పూర్ హాట్’ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే రాజధానిలో కూడా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

వారసత్వ పరిరక్షణపై ఆవేదన

ప్రభుత్వ నిర్ణయంపై పట్టణ నిపుణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. “ఇది బ్రూటలిస్ట్ ఆర్కిటెక్చర్ శైలికి చెందిన అరుదైన కట్టడం. 1950లలో ప్రాచుర్యం పొందిన ఈ శైలిలో కాంక్రీట్ అందాల కంటే వినియోగానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటి భవనాలను కూల్చకుండా, కొత్త ప్రాజెక్టులో భాగంగా పునర్వినియోగించుకుంటే బాగుండేది అని ప్రముఖ ఆర్కిటెక్ట్ దిప్తాంశు సిన్హా అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ భవనాన్ని ఎవరు డిజైన్ చేశారన్నది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది.

మాయమైన జ్ఞాపకం

“చిన్నప్పటి నుంచి ఈ వింత ఆకారాన్ని చూస్తూ పెరిగాం. నగరానికి ఇదొక ల్యాండ్‌మార్క్. అభివృద్ధి అవసరమే కానీ పాత జ్ఞాపకాలను తుడిచేస్తూనే చేయాలా?” అని స్థానిక నివాసి రుమ్మానుల్ ఫైజీ యూసుఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక అభివృద్ధికి చారిత్రక వారసత్వానికి మధ్య సమతుల్యం దెబ్బతింటోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా నాలుగు దశాబ్దాల పాటు పాట్నా నగర చరిత్రలో భాగంగా ఉన్న ‘ఏకతా భవన్’ ఇక కేవలం చిత్రపటాలకే పరిమితం కానుంది.