Let's talk: editor@tmv.in
ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ‘ఈహెచ్‌ఎస్’..నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ‘ఈహెచ్‌ఎస్’..నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

Panthagani Anusha
1 జూన్, 2026

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన ఆరోగ్య భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ‘ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్’ ( ఈహెచ్‌ఎస్) విధివిధానాలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేడు ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించిన కార్యాచరణ, ట్రస్ట్ ఏర్పాటు, లబ్ధిదారుల వివరాల సేకరణ తదితర కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేయనుంది. ఈ ట్రస్ట్‌లో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు ప్రతినిధులు, పెన్షనర్ల సంఘాల నుంచి ఇద్దరు ప్రతినిధులను సభ్యులుగా నియమించనున్నారు. అదేవిదంగా ఈ ట్రస్ట్‌కు ముఖ్య కార్యనిర్వాహణాధికారి ( సీఈవో )గా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరిని నియమించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం ఈ ట్రస్ట్ కమిటీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

పథకం క్షేత్రస్థాయి అమలుకు అవసరమైన సమాచార సేకరణ ప్రక్రియ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను సేకరించాలని ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ నెల 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, వారి సేవా వివరాలను ఒక నిర్దిష్ట నమూనాలో నమోదు చేసి సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

సేకరించిన లబ్ధిదారుల వివరాల ఆధారంగా ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ‘డిజిటల్ హెల్త్ కార్డులను’ జారీ చేయనుంది. ఈ కార్డుల ద్వారా ప్రభుత్వం గుర్తించిన నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఉద్యోగులు, పెన్షనర్లు పూర్తి ఉచితంగా (క్యాష్‌లెస్) వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నూతన ఆరోగ్య పథకం అందుబాటులోకి రావడం ద్వారా ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం సులభంగా అందడమే కాకుండా వారిపై పడే ఆర్థిక వైద్య ఖర్చుల భారం గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.