Let's talk: editor@tmv.in
నీట్ పేపర్ లీకేజీలపై విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: రాహుల్ గాంధీ

నీట్ పేపర్ లీకేజీలపై విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: రాహుల్ గాంధీ

Gaddamidi Naveen
18 మే, 2026

నీట్‌-యూజీ 2026 పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్‌ ఆరోపణలు దేశవ్యాప్తంగా వివాదానికి దారితీయగా, కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ ఈ అంశంపై మౌనం వీడాలని కోరారు.

సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో స్పందించిన రాహుల్‌ గాంధీ, “నీట్‌ 2024లో ప్రశ్నాపత్రం లీక్‌ అయినా పరీక్ష రద్దు కాలేదు. మంత్రి రాజీనామా చేయలేదు. సీబీఐ దర్యాప్తు చేపట్టింది, ఒక కమిటీ ఏర్పాటైంది. ఇప్పుడు నీట్‌ 2026లో కూడా అదే పరిస్థితి మళ్లీ పునరావృతమైంది. పరీక్ష రద్దయింది, సీబీఐ మళ్లీ దర్యాప్తు చేస్తోంది, మరో కమిటీ ఏర్పాటవుతోంది. అయినా విద్యాశాఖ మంత్రి పదవిలోనే కొనసాగుతున్నారు అంటూ విమర్శించారు. పరీక్షా పత్రాల లీకులు వరుసగా ఎందుకు జరుగుతున్నాయో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రధాని మోడీని ఆయన ప్రశ్నించారు. పదేపదే వైఫల్యం ఎదుర్కొంటున్న విద్యాశాఖ మంత్రిని ఎందుకు తొలగించడం లేదని కూడా నిలదీశారు.

సీబీఐ దర్యాప్తు తీవ్రత

మరోవైపు, ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితురాలు మనీషా గురునాథ్ మాంధారేను సీబీఐ ఆదివారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. తదుపరి విచారణ నిమిత్తం ఆమెకు 14 రోజుల కస్టడీ విధించాలని కోరింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్యానెల్‌లో నిపుణురాలిగా, అనువాదకురాలిగా పనిచేసిన మనీషాకు ఈ లీకేజీతో సంబంధాలు ఉన్నాయని, ఎన్టీఏ అనుసరించిన పూర్తి ప్రక్రియపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని సీబీఐ కోర్టుకు తెలిపింది.

నిరసనలు - తదుపరి చర్యలు

ఈ లీకేజీకి నిరసనగా మే 21న బెంగళూరులో కర్ణాటక యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో "రాజ్ భవన్ చలో" ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా, రద్దయిన నీట్-యూజీ పరీక్షను తిరిగి జూన్ 21న నిర్వహించనున్నారు. భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలు జరగకుండా ఉండేందుకు, వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రకటించారు.