

పేద విద్యార్థుల భవిష్యత్తును మార్చేది విద్యే: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో విద్య, గృహ నిర్మాణం, మహిళా సాధికారతకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యే పేద కుటుంబాల భవిష్యత్తును మార్చగల శక్తివంతమైన సాధనమని, ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించాలని పిలుపునిచ్చారు.
తిప్పర్తిలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జూనియర్ కళాశాల భవన పనులను పరిశీలించిన మంత్రి, నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. గత ఏడాది తిప్పర్తి, కనగల్ మండలాలకు ఒక్కొక్కటి రూ.6 కోట్లతో ఆధునిక సౌకర్యాల జూనియర్ కళాశాల భవనాలు మంజూరు చేసినట్లు తెలిపారు. నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రాష్ట్రంలోని సుమారు 3.5 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచే ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇంటర్ కళాశాలల్లో కంప్యూటర్ విద్యతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బోధనను కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
అంతకుముందు తిప్పర్తిలో నిర్మాణం పూర్తయిన 100 డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించిన మంత్రి, జూలై 1 నాటికి అన్ని సదుపాయాలతో గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు తన వంతుగా ఒక్కో కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ప్రతి మండలంలో రైస్ మిల్లుల ఏర్పాటు దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఇటీవల మహిళా సంఘాలకు రూ.500 కోట్ల వడ్డీలేని రుణాలను ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తుచేశారు.
తిప్పర్తి అభివృద్ధిలో భాగంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్ కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పదో తరగతి తర్వాత విద్యార్థులు చదువు మానేయకుండా ఉన్నత విద్య వైపు అడుగులు వేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్‌తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
