
పంజాబ్ మాజీ డీఐజీ భుల్లర్ నివాసాల్లో ఈడీ సోదాలు
పంజాబ్‌కు చెందిన సస్పెండ్ అయిన పోలీస్ అధికారి, మాజీ డీఐజీ హర్‌చరణ్ సింగ్ భుల్లర్‌పై మనీ లాండరింగ్ కేసులో ఈడీ సోమవారం పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. అధికారుల వివరాల ప్రకారం, చండీగఢ్, లూధియానా, పాటియాలా, నాభా (పాటియాలా జిల్లా), జలంధర్ ప్రాంతాల్లో మొత్తం 11 ప్రాంగణాల్లో ఈ దాడులు జరిగాయి. భుల్లర్‌కు సంబంధించిన నివాసాలు, అతని అనుచరులు, అలాగే అనుమానిత బినామీ ఆస్తులపై ఈ సోదాలు కొనసాగాయి. ఈ దాడులు ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) చట్టం కింద నిర్వహించారు.
సోదాల సమయంలో కేంద్ర పారా మిలిటరీ దళాలు ఈడీ బృందాలకు భద్రత కల్పించాయి. ఈ కేసు దర్యాప్తు కోసం ఈడీ ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేసింది. ఈడీ దర్యాప్తు, ముందుగా సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ప్రారంభమైంది. కేసు వివరాల ప్రకారం, భుల్లర్ ఒక మధ్యవర్తి ద్వారా లంచం తీసుకుని ఒక క్రిమినల్ కేసును సెటిల్ చేయడానికి ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి. అలాగే అతని ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. సోదాల ముఖ్య ఉద్దేశ్యం, అక్రమంగా సంపాదించిన డబ్బు మార్గాలను గుర్తించడం, బినామీ ఆస్తులను వెలికితీయడం, మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఆధారాలు సేకరించడం అని అధికారులు తెలిపారు. భుల్లర్, అప్పట్లో రోపర్ రేంజ్ డీఐజీగా పనిచేస్తున్న సమయంలో, 2025 అక్టోబర్‌లో సీబీఐ అతన్ని, అతని మధ్యవర్తి కృష్ణౌను అరెస్ట్ చేసింది. గతంలో ఒక స్క్రాప్ డీలర్ నుంచి కేసు పరిష్కారం కోసం లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. చండీగఢ్‌లో వలపన్ని మధ్యవర్తి నుంచి రూ.5 లక్షలు (మొత్తం రూ.8 లక్షల లంచంలో భాగం) తీసుకుంటున్న సమయంలో సీబీఐ పట్టుకుంది. అనంతరం భుల్లర్ నివాసంలో రూ.7.50 కోట్లు నగదు, 2.5 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుంది. ఇటీవల, భుల్లర్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు తీసుకోలేదు. అయితే, కేసు విచారణ రెండు నెలల్లో ప్రారంభం కాకపోతే పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.
