
ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్ సంస్థలపై ఈడీ దాడులు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు అశోక్ మిట్టల్‌కు చెందిన వ్యాపార సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ తీవ్రంగా ఖండించారు. రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి నుంచే సిద్ధమవుతోందని ఆయన ఆరోపించారు. అధికారుల ప్రకారం, విదేశీ మారక నియంత్రణ చట్టం (ఫెమా) కింద జరుగుతున్న విచారణలో భాగంగా ఈడీ అధికారులు పంజాబ్, హర్యానాలోని మిట్టల్‌కు సంబంధించిన వ్యాపార, నివాస ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు. 61 ఏళ్ల మిట్టల్ ఇటీవల ఆమ్‌ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభలో ఉప నేతగా నియమితులయ్యారు. ఆయన లవ్‌లీ ప్రోఫెషనల్ యూనివర్సిటీకి ఛాన్సలర్‌గా కూడా ఉన్నారు.
సీఎం మాన్ స్పందన
ఈ దాడులపై స్పందించిన భగవంత్ మాన్, ఎక్స్‌లో చేసిన పోస్టులో పంజాబ్ ఎన్నికల కోసం బీజేపీ సిద్ధమవుతోంది. ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంటి వద్ద, విశ్వవిద్యాలయంలో ఈడీ దాడులు… ఇదే మోడీ శైలి అని వ్యాఖ్యానించారు.
బీజేపీ ప్రతిస్పందన
మాన్ వ్యాఖ్యలపై పంజాబ్ బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు మాట్లాడుతూ ఆప్ పార్టీ ‘దొంగలు, దోపిడీదారుల పార్టీ’ అని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం కింద అవినీతిని కూడా శుభ్రం చేస్తామని ఆయన పేర్కొన్నారు. పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాకర్ కూడా సీఎం మాన్ వ్యాఖ్యలను ఖండిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అవినీతి కేసుల్లో చర్యలు తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వస్తుందని అన్నారు.
ఆప్ నేతల మద్దతు
ఇదిలా ఉండగా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈడీ దాడులను ఖండించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందని ఆప్ నేతలు విమర్శించారు.
